రాజ్ భవన్ లో బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్!

Related image

బతుకమ్మ సంబురాలను రాజభవన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు బంగారం, దుస్తులతోపాటు పూలను బాగా ఇష్టపడతారని, శరత్ రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండుగ బతుకమ్మ పండుగ అని ఆమె అభివర్ణించారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో

కలవారి కోడలు ఉయ్యాలో

కలికి కామాక్షి ఉయ్యాలో అని రాగతాళ యుక్తంగా తెలుగులో చక్కగా ఆమె ఆలాపించారు.

ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ అభిమానులు, రచయిత్రులు ఐనంపూడి శ్రీలక్ష్మి, ఆవుల మంజులత, దీపికారెడ్డి, ఆమె శిష్య బృందం, తదితర మహిళలు 200 మందికి పైగా విశేషంగా పాల్గొన్నారు. ఎంతో సంతోషంగా వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగను రాజభవన్ ప్రాంగణంలో అక్టోబరు 5 వరకూ ప్రతిరోజూ  సాయంత్రం 6 నుండి ఓ గంటపాటు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు గవర్నరు కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. ముఖ్యంగా, అక్టోబరు 1న మహిళా జర్నలిస్టులు, న్యాయవాదులు, అక్టోబరు 4న విద్యార్థులు పాల్గొంటున్నారని ఆయన అన్నారు. అక్టోబరు 5న రాజభవన్ మహిళా ఉద్యోగినులు, రాజభవన్ పరివారం పాల్గొంటారని ఆయన అన్నారు.

Telangana
Hyderabad
rajbhavan
tamilisai
bhathukamma

More Press Releases