ఈనెల 12న సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 12 వ తేదీన రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన పనులకు హాజరవుతారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, ఎస్ఎన్డీపీ, టౌన్ ప్లానింగ్ ఇతర శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. దాదాపు 61 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ శాఖ మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నాలా పరిసర ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి 45 కోట్ల రూపాయలు మంజూరు చేశారని సనత్ నగర్ నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 9.00 గంటలకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎస్పీ రోడ్ లోని ఖరాచి బేకరీ వద్ద పికెట్ నాలాపై 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి పనులను ప్రారంభిస్తారని తెలిపారు.
అనంతరం పాటిగడ్డలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మల్టి పర్ఫస్ పంక్షన్ హాల్ పనులను గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభిస్తారని తెలిపారు. అదేవిధంగా 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బేగంపేట నాలా అభివృద్ధి పనులను ప్రకాష్ నగర్, అల్లంతోట బావి ప్రాంతాలలో ప్రారంభిస్తారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. బేగంపేట లోని నాలాకు ఎగువ నుండి వచ్చే వరద నీటితో బ్రాహ్మణ వాడి, అల్లంతోట బావి, వడ్డెర బస్తీ, మాతాజీ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాలు వరద నీటి ముంపుకు గురై ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు.
ఎన్నో సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం 45 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని మంత్రి వివరించారు. ఈ నిధులతో నాలాకు రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, పైప్ లైన్ లు, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం బుద్ధ భవన్ లో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలేక్త్రిసిటీ, హౌసింగ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సనత్ నగర్ నియోజకవర్గంలో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులు, మరియు భవిష్యత్ లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ప్రధానంగా పలు మెయిన్ రోడ్లు అభివృద్ధి, నిర్మాణ పనులు ఎంతో వేగంగా సాగుతున్నాయని, పేద ప్రజలు నివసించే ఇంటర్నల్ రోడ్లు సీసీ రోడ్లుగా నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రైల్వే శాఖ పెండింగ్ పనులపై కేటీఆర్ సమీక్ష:
సనత్ నగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో జీహెచ్ఎంసీ, రైల్వే శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల అమలుపై బుద్ధ భవన్ లో జరిగే సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఇందులో భాగంగా రాణిగంజ్ వద్ద 16.44 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆర్.యూ.బీ విస్తరణ పనులు, 45 కోట్ల రూపాయల వ్యయంతో ఫతే నగర్ బ్రిడ్జి వద్ద నిర్మించనున్న మూడు వరుసల ఆర్.ఓ.బీ, సనత్ నగర్ ఇండస్ట్రి యల్ పార్క్ ప్రాంతం నుండి నర్సాపూర్ చౌరస్తా వరకు కలిపే ఆర్.యూ.బీ పనులతో పాటు నగరంలో హెచ్.ఆర్.డీ.సీ.ఎల్, ఎస్ఎన్డీపీ, ప్రాజెక్ట్ విభాగాల ఆధ్వర్యంలో చేపడుతున్న పలు రైల్వే సంబంధిత పనులపై కూడా సమావేశంలో చర్చిస్తామని ఆయన వివరించారు.
మూడు శాఖల అధికారులు సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై తుది నివేదికలను రూపొందించి అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియా ఉద్దిన్, టౌన్ ప్లానింగ్ సీసీపీ దేవేందర్‌రెడ్డి, ఎస్ఎన్డీపీ సీఈ వసంత, హెచ్.ఆర్.డీ.సీ.ఎల్ సరోజినీ, జోనల్ కమిషనర్ లు శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, ఎస్ఈలు అనిల్ రాజ్, రత్నాకర్, భాస్కర్ రెడ్డి, ఈఈ ఇందిర తదితరులు పాల్గొన్నారు.