గ్ల‌కోమా గురించి విశ్లేష‌ణాత్మ‌కంగా తెలుసుకుందాం: డాక్ట‌ర్‌ బి. ప్రణతి

Related image

  • డాక్ట‌ర్‌ బి. ప్రణతి Sr. Consultant & Head of Department of Ophthalmology
  • Cataract, Glaucoma & Refractive Surgeon కిమ్స్ హాస్పిట‌ల్స్, సికింద్రాబాద్‌
కంటి స‌మ‌స్య‌ల‌పై సాధార‌ణంగా ప్ర‌జ‌లు కొద్దిగా అల‌స‌త్వం వ‌హిస్తారు. అయితే ఇవి చాలా ప్ర‌మాదాన్ని తెచ్చిపెడుతుంటాయి. అందులో గ్ల‌కోమా అనేది చాలా కీల‌కం. ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వరి నెల‌లో జాతీయ గ్లకోమా మాసంగా నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా గ్లకోమాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన తీసుక‌రావ‌డానికి వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌డుతారు. ఇప్పుడు మ‌నం గ్ల‌కోమా గురించి విశ్లేష‌ణాత్మ‌కంగా తెలుసుకుందాం.

గ్ల‌కోమా అంటే ఏంటి?

దీర్ఘ‌కాలికంగా కంటిలో ఒత్తిడి పెరిగి దృష్టి నాడి దెబ్బ‌తిని క్ర‌మంగా కంటిచూపు క్షిణిస్తుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉంటే గ్ల‌కోమా వ్యాధి అని అంటారు.

మన దేశంలో గ్లకోమా తీవ్రత:

భారతదేశంలో ఒక కోటి పన్నెండు లక్షలమంది ప్రజలు గ్లకోమా బారినపడగా, అందులో పన్నెండు లక్షలమంది పూర్తిగా చూపుకోల్పోయారు. మన దేశంలో సుమారు 90 శాతం కేసులు ఇంకా నమోదు చేయబడలేదు అని ఓ అంచన.

ఎవరు పరీక్ష చేయించుకోవాలి?
  • 40 ఏళ్లు పైబడినవారు.
  • అధిక మయోపియా మరియు అధిక హైపర్‌మెట్రోపియా ఉన్న వ్యక్తులు.
  • మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు.
  • కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉన్నా.. పూర్వం కంటికి దెబ్బలు తగిలినవారు.
  • దీర్ఘ కాలంగా స్టెరాయిడ్స్ (steroids) మాత్రలు మరియు కంటి చుక్కల మందు వాడేవారు.

గ్లకోమా లక్షణాలు:
  • చాల సమయాల్లో చూపు కోల్పోయేవరకు ఏ లక్షణాలు కనిపించ‌వు. అందుకే ఈ వ్యాధిని అదృశ్య శత్రువు” అంటారు.
  • ఒక కంటికి లేదా రెండు కళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి.
  • మీ పరిధీయ దృష్టి నష్టం ( పక్క చూపు తగ్గడం) క్రమంగా మొదలై, కొన్ని సంవత్సరాల్లో పూర్తి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
  • కంటిలో లేదా కంటి చుట్టూ నొప్పి రావచ్చు.
  • హఠాత్తుగా కన్ను ఎర్రబడడంతో పాటు తలనొప్పి, కన్ను నొప్పి ఉంటుంది.

గ్లకోమా అని ఎలా నిర్ధారిస్తారు?
  • పైన చెప్పబడిన లక్షణాలు మీకు ఉంటే వెంటనే, సమీపంలో ఉన్న కంటి వైద్యులని సంప్రదించండి.
  • క్ర‌మం త‌ప్ప‌కుండా కంటి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఈ ప‌రీక్ష‌ల్లో మీ కంటి చూపు, కంటిలోని ఒత్తిడి, దృష్టి నాడి యొక్క స్థితి పరీక్షిస్తారు.
  • కంటి వైద్యునికి మీకు గ్లకోమా ఉన్నట్టు అనిపిస్తే నిర్ధారిత పరీక్షలు కొన్ని ఉదాహరణకి ఓసిటీ (OCT), దృష్టి క్షేత్ర పరీక్షా (visual field examination) చేయిస్తారు. వీటి ద్వారా ఏరకమైన గ్లకోమా ఉందో నిర్ధారించి, చికిత్స విధానం నిర్ణయిస్తారు.

గ్లకోమా చికిత్స:
  • గ్లకోమా వ్యాధికి మొదట చుక్కల మందులు, లేజర్ వంటివి చేసి కంటిలోని ఒత్తిడిని తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. లేసర్ లేదా చుక్కల మందులతో ఒత్తిడి తగ్గకపోతే శస్త్ర చికిత్స చేయాల్సివస్తుంది.
  • చికిత్స మొదలుపెట్టిన తరువాత ఏడాదికి ఒకసారి తప్పక కంటి పరీక్ష, కంటిలోని ఒత్తిడి పరీక్ష, దృష్టి క్షేత్ర పరీక్ష చేయించుకోవాలి.
  • చాలా మంది ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడం వలన తమ చూపు కోల్పోతున్నారు.
  • నేడే గ్లకోమా గురించి తెలుసుకోండి. ముందుచూపుతో వ్యవహరించండి. అంధత్వాన్ని నివారించుకోండి.

More Press Releases