డిజిటల్ మార్కెటింగ్, న్యాయశాస్త్రంపై టీ-శాట్ స్పెషల్ ఎపిసోడ్స్

Related image

  • డిసెంబర్ 16వ తేదీ నుండి ప్రసారాలు
  • హైదరాబాద్ ఇక్ఫాయ్ యూనివర్సిటీ అనుబంధ కార్యక్రమాలు
హైదరాబాద్: మారుతున్న మార్కెటింగ్ పద్దతులకు అనుగుణంగా యువతలో వృత్తి  నైపుణ్యం పెంచేందుకు డిజిటల్ మార్కెట్ పై ప్రత్యేక శిక్షణ పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు టీ-శాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి తెలిపారు. ప్రసారాల షెడ్యూలుకు సంబంధించిన వివరాలపై మంగళవారం పత్రిక పకటన విడుదల చేశారు. టీ-శాట్ నెట్ వర్క్ ఛానళ్లతో హైదరాబాద్ ఇక్ఫాయ్ (ICFAI) యూనివర్సిటీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డిజిటల్ మార్కెటింగ్ మరియు లా అవేర్ నెస్ పై ప్రత్యేక ప్రసారాలు అందించనున్నామని శైలేష్ రెడ్డి తెలిపారు.

ఈ నెల 16వ తేదీ గురువారం నుండి ఇక్ఫాయ్ యూనివర్సిటీ లా, బిజినెస్ స్కూల్ అందించే డిజిటల్ మార్కెటింగ్, న్యాయశాస్త్రం లోని పలు ప్రత్యేక అంశాలపై అవగాహన ప్రసారాలుంటాయన్నారు. ఆధునిక పద్దతులకు అనుగుణంగా అందించే ప్రసారాలను యువత వినియోగించుకోవాలని సూచించారు. శని, ఆదివారాలు మినహా ప్రతి రోజు ఉదయం నిపుణ ఛానల్ లో 9.30 నుండి 10 గంటల వరకు, విద్య ఛానల్ లో రాత్రి 9.30 నుండి 10 గంటల వరకు 30 నిమిషాల పాటు అనుభవం కలిగిన ఇక్ఫాయ్ యూనివర్సిటీ అధ్యాపక బృందం బోధించిన పాఠ్యాంశాలు ప్రసారమౌతాయన్నారు.

ఇప్పటి వరకు పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన పాఠ్యాంశాలు అందించిన టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రస్తుతం యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు సైతం బోధన అందిస్తుందని వివరించారు. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి రావాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరువ చేసేందుకు ఐటి కమ్యూనికేషన్ల శాఖ పరిధిలోని టి-సాట్ నెట్వర్క్ తమ వంతు ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ఇక్ఫాయ్ యూనివర్సిటీ సహకారంతో ప్రస్తుతం అందిస్తున్న డిటిటల్ మార్కెటింగ్, న్యాయశాస్త్రంలోని పలు అంశాలపై పాఠ్యాంశాలతో పాటు ఇతర విభాగాలపైనా పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగనున్నాయని తెలిపారు.

టీ-శాట్ ఛానళ్లలో ప్రసారమైన పాఠ్యాంశాలు టీ-శాట్ డిజిటల్ మీడియా వేదికలోనూ అందుబాటులో ఉంటాయని, తెలంగాణ యువత వీటిని వినియోగించుకొని ఉన్నత స్థాయి అవకాశాలు పొంది బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఈవో శైలేష్ రెడ్డి పిలుపునిచ్చారు.

More Press Releases