నెక్లేస్ రోడ్ లో విద్యుత్ వాహనాల ప్రదర్శన ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

Related image

  • భవిష్యత్ విద్యుత్ వాహనాలదే
  • పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుంది
  • ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది
  • పాల్గొన్న ప్రభుత్వ ఇంధన శాఖా ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, రెడ్కో విసి&యండి జానయ్య తదితరులు
హైదరాబాద్: భవిష్యత్ మొత్తం విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వాడకంలో ఎటువంటి అపోహలు వలదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వాహనాల వినియోగంతో పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఆయన చెప్పారు. టియస్ రెడ్కో ఆధ్వర్యంలో శనివారం రోజున నెక్లేస్ రోడ్ లో విద్యుత్ వాహనాల ప్రదర్శనను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఆయన విద్యుత్ తో నడిచే వాహనాలను మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా నడిపించి ప్రదర్శనలో పాల్గొన్న వారిని ఆకర్షించారు. టియస్ రెడ్కో విసి&యండి యన్. జానయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఇంధన శాఖా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, భారత ప్రభుత్వ బి ఇ ఇ డి జి అభయ్ బక్రే, టి యస్ రెడ్కో చైర్మన్ జనాబ్ సయ్యద్ అబ్దుల్ అలిమ్, టి యస్ రెడ్కో జి యం జి యస్ వి ప్రసాద్, పవర్ గ్రిడ్ ఇ డి అనూప్ కుమార్, సి జే యం అనిల్ కుమార్, ఇ ఇ యస్ ఎల్ జి యం సావిత్రి సింగ్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణం ప్రపంచానికి సవాల్ విసురుతున్న నేపధ్యంలో విద్యుత్ వాహనాలు వాడకంలోకి రావడాన్ని ఆయన స్వాగతించారు. మనం సృష్టిస్తున్న సనస్యలతోటే పర్యావరణం సమస్య ఉత్పన్నం అవుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాని నుండి బయట పడాలి అంటే పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వేదజల్లుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలన్నారు. అందుకు విద్యుత్ వాహనాల వినియోగం తప్పనిసరి అవుతుందని ఆయన చెప్పారు.

విద్యుత్ వాహనాల వినియోగంలో ఎటువంటి అపోహలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ సమస్యను మొట్టమొదటిసారిగా గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దానిని అధిగమంచడానికే హరితహారం కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రంలో హరితహారం ఇప్పుడు ఒక ఉద్యమంలా కొనసాగుతుందన్నారు.

అందుకు కొనసాగింపుగా విద్యుత్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అందులో భాగంగానే టి యస్ రెడ్కో ఆధ్వర్యంలో విద్యుత్ వాహనాల ప్రదర్శన ప్రారంభించుకున్నామని ఆయన తెలిపారు. ఇందుకు ఇ ఇ యస్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు భాగస్వామ్యం అయ్యాయన్నారు. అదే సమయంలో డిమాండ్ కు తగినట్లుగా సప్లై లేకపోయినప్పటికీ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిమీద ఉందని ఆయన తెలిపారు.

అదే సమయంలో రిపేరింగ్, ఛార్జింగ్ వంటి వాటిపై ఎటువంటి అపోహలకు ఆస్కారం లేదన్నారు. ఇప్పటివరకు 136 ఛార్జింగ్ కేంద్రాలను ప్రారంభించమన్నారు. ఇకపై జాతీయ రహదారుల అన్నింటి మీద ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. 

More Press Releases