కేబీఆర్ పార్కులో ఘనంగా పికాక్ ఫెస్టివల్
- పెద్ద సంఖ్యలో హాజరైన ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు
- అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యతపై పిల్లలకు అవగాహన, డ్రాయింగ్, పెయిటింగ్, స్నేక్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ పార్కుకు వచ్చే సందర్శకులకు, వాకర్స్ కు ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ విరివిగా కనిపించే నెమళ్లే.. ఈ యేడు జంతుగణనలో ఐదు వందలకు పైగా నెమళ్లు కేబీఆర్ పార్కులో ఉన్నట్లు నమోదు అయింది. వీటి సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా చిన్న పిల్లల్లో అడవులు, వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అటవీ శాఖ ప్రతీ యేటా నిర్వహిస్తోంది.
వివిధ స్కూళ్ల నుంచి వందలాది మంది పిల్లలు ఈసారి పికాక్ ఫెస్టివల్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాల్గొన్నారు. ఫ్రెండ్న్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు నిర్వహించిన స్నేక్ షో లు వివిధ రకాల పాములు, అవి వ్యవహరించే తీరును పిల్లలకు వివరించారు. అలాగే అడవులు, జంతువులకు సంబంధించిన డ్రాయింగ్, పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు అటవీ శాఖ అధికారులు బహుమతులను అందించారు.
స్కూలు పిల్లలు పర్యావరణ అంబాసిడర్లుగా వ్యవహరించాలని, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మనుగడ అని గుర్తించాలని కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ అన్నారు. ప్రతీ ఒక్కరిలో పర్యావరణ స్ఫృహ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అర్బన్ ఫారెస్ట్ పార్కులను (109) అభివృద్ది చేస్తోందని గుర్తు చేశారు. స్కూలు పిల్లలకు వారి రెగ్యులర్ సిలబస్ తో పాటు పర్యావరణం, జంతు సంరక్షణపై టీచర్లు అవగాహన కల్పించాలని హాజరైన టీచర్లను పీసీసీఎఫ్ ప్రత్యేకంగా కోరారు.
కార్యక్రమంలో పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు సిద్దానంద్ కుక్రేటీ, పర్గెయిన్, వినయ్ కుమార్, ఏ.కే. సిన్హా, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్, డీఎఫ్ఓ జోజి, ఓఎస్డీ శంకరన్, రేంజ్ ఆఫీసర్ అనురాధ, ఇతర అధికారులు, సిబ్బందితో పాటు వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు, టీచర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.