వి.ఎల్.ఎస్.ఐ పై ఇంజనీరింగ్ విద్యార్థులకు రెండవ విడత పాఠ్యాంశాలు
- డిసెంబర్ నాల్గవ తేదీ నుండి ప్రసారాలు ప్రారంభం
- ఉదయం 11 నుండి ఒంటి గంట వరకు ప్రత్యేక లైవ్
- ప్రముఖ ఐటి కంపెనీల భాగస్వామ్యం- టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి
టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ప్రసారాలకు సంబంధించిన వివరాలు వెళ్లడించారు. టి-సాట్ వేదికగా తెలంగాణ ఐటి కమ్యూనికేషన్ల శాఖ ఆధీనంలో పొటానిక్స్ వ్యాలీ కార్పోరేషన్, టాస్క్ సంస్థలు సంయుక్తంగా ఐటి కంపెనీల భాగస్వామ్యంతో వి.ఎల్.ఎస్.ఐ పై రెండవ విడత అవగాహన కార్యక్రమాలు ప్రారంభమౌతాయన్నారు. ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకు హైదరాబాద్ లోని ప్రముఖ ఐటి కంపెనీల ప్రతినిధులు హాజరై వి.ఎల్.ఎస్.ఐ పై అవగాహన పాఠ్యాంశాలు బోధించనున్నారని సీఈవో తెలిపారు.
తెలంగాణ నిరుద్యోగ యువతకు చదువుతో పాటు వృత్తి నైపుణ్యం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, లేటేస్ట్ కంప్యూటింగ్ టెక్నాలజి, కార్పోరేట్ హెడ్స్ మరియు అకడమిషీయన్స్ తో ప్యానెల్ డిస్కషన్స్, క్విజ్, జామ్ సెషన్స్ తో పాటు ఇతర కంప్యూటింగ్ టెక్నాలజి పై సబ్జెక్ట్ నిపుణులు బోధిస్తారని శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు. గత జూలై నెలలో 15 రోజుల పాటు నిర్వహించిన మొదటి విడత వి.ఎల్.ఎస్.ఐ శిక్షణ కార్యక్రమం ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి ప్రయోజనం చేకూర్చిన దృష్ట్యా రెండవ విడత ప్రసారాలను అందిస్తున్నామన్నారు. శిక్షణ ద్వార వి.ఎల్.ఎస్.ఐ పురోగతి, ఉద్యోగాల కల్పన, నైపుణ్యం, ఆయా సంస్థల టెక్నాలజి సమాచారం విద్యార్థులకు అందించడమే ప్రధాన లక్ష్యమని సీఈవో వివరించారు.
టి-సాట్ నిపుణ ఛానల్ లో ఉదయం ప్రసారమైన పాఠ్యాంశాలు మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పున: ప్రసారమౌతాయని, ప్రసార పాఠ్యాంశాలు టి-సాట్ యాప్, యూట్యూబ్ (tsat.tv/YouTube)లో అందుబాటులో ఉంటాయని సీఈవో శైలేష్ రెడ్డి గుర్తు చేశారు.