కారుణ్య నియామకం క్రింద 12 మందికి ఉద్యోగ అవకాశం
- నియామకపు ఉత్తర్వులు అందించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి
నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ కోవిడ్-19తో మరణించిన 4 గురి కుటుంబ సభ్యులలో ఒక్కొకరి చొప్పున మరియు ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించిన వారి స్థానములో 8 మందికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించుటలో భాగంగా నేడు కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలసి 12 మందికి కారుణ్య నియామకపు ఉత్తర్వులను అందజేశారు.
ఈ సందర్భములో కమిషనర్ మాట్లాడుతూ మీ యొక్క విద్యార్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్, సోషల్ వర్కర్, టర్న్ కాక్, వాచ్ మాన్, శానిటరీ మేస్త్రి, పబ్లిక్ హెల్త్ వర్కర్ వంటి పోస్టింగ్ లను కేటాయిస్తూ వివిధ విభాగములలో పోస్టింగ్లు ఇచ్చుట జరిగిందని, మీరందరు విధి నిర్వహణలో బాధ్యతాయుతముగా విధులు నిర్వహించాలని సూచించారు. పై కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) డా. జె.అరుణ, మేనేజర్ డి.వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
దేవినగర్ నందు రూ.41 లక్షల అంచనాలతో అభివృధి పనులకు శంఖుస్థాపన: సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 30వ డివిజన్ దేవినగర్ లో రూ.9.25 లక్షలతో ఆర్.సి.సి డ్రెయిన్ నిర్మాణ పనులకు మరియు రూ.31.75 లక్షల అంచనాలతో దేవినగర్ కాలువ అంచున ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డితో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ సాధారణ నిధులతో దేవినగర్ నందలి 5వ క్రాస్ రోడ్ నుండి 6వ క్రాస్ రోడ్ వరకు సుమారు 55 మీటర్ల పొడవున పాడైన డ్రెయిన్ నిర్మాణం మరియు దేవినగర్ కాలువ అంచున సుమారు 500 మీటర్ల పొడవున ఫెన్సింగ్ ఏర్పాటు చేయు పనులకు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించుట జరిగిందని అన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వేగవంతముగా పూర్తి చేయునట్లుగా చూడాలని అన్నారు.
కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.