గొర్రెల యూనిట్లకు లబ్దిదారులు వాటాధనం చెల్లించాలి: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్ ల కోసం లబ్దిదారులు తమ వాటాధనం డీ.డీలు చెల్లించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్య, షీఫ్ ఫెడరేషన్ ఎండీ రాంచందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రిక పథకం ద్వారా గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. గొర్రెల యూనిట్ ల పంపిణీ లో ప్రభుత్వ వాటా 75 శాతం కాగా, 25 శాతం లబ్దిదారుడి వాటా అని చెప్పారు. మొదటి విడతలో 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు.

పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ ధరను పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు విన్నవించగా, వెంటనే స్పందించి యూనిట్ గొర్రెల ధరను లక్ష 25 వేల రూపాయల నుండి లక్ష 75 వేల రూపాయలకు పెంచారని మంత్రి అన్నారు. ఇప్పటికే డీ.డీ చెల్లించిన 4,761 మంది లబ్దిదారులు పెరిగిన యూనిట్ ధరకు అనుగుణంగా 12,500 రూపాయల అదనపు వాటాధనంను చెల్లించారని తెలిపారు. వీరిలో 1119 మందికి గొర్రెల యూనిట్ లను పంపిణీ చేసినట్లు వివరించారు. అర్హులైన లబ్దిదారులు అందరు వాటాధనం చెల్లించి గొర్రెల యూనిట్ లను పొందాలని కోరారు. డీ.డీ లు చెల్లించిన లబ్దిదారులకు వెంట వెంటనే గొర్రెల యూనిట్ లను అందజేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

20వ తేదీలోగా చేప, రొయ్య పిల్లల పంపిణీని పూర్తి చేయాలి: మంత్రి తలసాని
 
మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 18336 నీటి వనరులలో 50.60 కోట్ల చేప పిల్లలను 30 రిజర్వాయర్ లలో 1.92 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేసినట్లు వివరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న చేప, రొయ్య పిల్లలను మాత్రమే విడుదల చేయాలని, విడుదల ప్రక్రియను తప్పకుండా వీడియో, ఫోటోగ్రఫీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా  వ్యవహరించినట్లు తమ దృష్టికి వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. చేప, రొయ్య పిల్లల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.

More Press Releases