ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

Related image

విజయవాడ: ప్రజలందరి జీవితాల్లో దీపావళి పండుగ వెలుగులు నింపాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. దీపావళి వేడుకను పురస్కరించుకని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి దివ్య కాంతులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ శాంతి, శ్రేయస్సు, ఆనందాలను అందించాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని దీపావళి సూచిస్తుందని, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ విజయగాధలు విపత్తులను జయించటానికి మనకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తాయని వెల్లడించారు. శాంతి, స్నేహం, మత సామరస్యంతో నిండిన సమాజాన్ని నిర్మించడానికి మనల్ని ప్రేరేపిస్తాయన్నారు.

చీకటిని పారద్రోలుతూ వెలుగులు తీసుకువచ్చే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల హరివిల్లుకు వేదిక కావాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని ఆకాంక్షించారు. జనాభాలో అధిక శాతం టీకాలు పొందినప్పటికీ ఎటువంటి అశ్రద్ధ వహించకుండా, ముఖ ముసుగు ధరించటం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనా నియమావళికి కట్టుబడి పండుగ సంబరాలను జరుపుకోవాలని హరిచందన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారు ఎటువంటి ఆలస్యం లేకుండా తీసుకోవాలని, వాక్సిన్ మాత్రమే వైరస్ నుండి రక్షణను అందిస్తుందన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

More Press Releases