కోవిడ్ మెగా వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్,అక్టోబర్ 12: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు నగరానికి నాలుగువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రుల ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, వీటి డిజైన్ ల రూపకల్పన జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కోవిడ్ మెగా వ్యాక్సిన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వి, రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ఓ.ఎస్.డి గంగాధర్, జీహెచ్ఎంసి జోనల్ కమీషనర్ రవికిరణ్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
దసరానుండి నగరంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో పేషంట్ అటెండెంట్ లకు షెల్టర్ల ఏర్పాటుతోపాటు హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 2.80 కోట్ల మందికి వ్యాక్సిన్ అందచేశామని, దీనిలో కోటి రెండు లక్షల మందికి సింగల్ డోస్ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కోవిద్ వ్యాక్సిన్ కు కొరత లేదని, ఈ నెలలో కూడా ఒక కోటి డోస్ లు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 3 నుండి 4 లక్షలమందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నామని, నగర, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహంతో వాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నామని అన్నారు.
ఖాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కేర్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మెగా వాక్సినేషన్ కేంద్రంలో ప్రతీ రోజూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటలవరకు కోవిడ్ వ్యాక్సిన్ ను అందచేసే సౌకర్యాన్ని కల్పించామని సోమేశ్ కుమార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ విధమైన మెగా కోవిద్ వ్యాక్సిన్ కేంద్రాలను మరో ఆరు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మెగా వాక్సినేషన్ కేంద్రంలో వృద్దులకు, మహిళలకు ప్రత్యేక వ్యాక్సిన్ కౌంటర్లు ఏర్పాటు చేశామని, కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉంచామని తెలియజేశారు.