యురేనియం అన్వేషణ నల్లమల మీద ఎక్కుపెట్టిన తుపాకీ: పవన్ కల్యాణ్!
తుపాకీ కిందకి దించే వరకు పోరాడుదాం
అవసరం అయితే పాదయాత్రకు సిద్ధం
ఓ సైనికుడి వలే మీతో కలసి నడుస్తాం
నల్లమల పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
యురేనియం అన్వేషణ అనేది నల్లమల మీద ఎక్కుపెట్టిన తుపాకీ లాంటిదని, కచ్చితంగా దాన్ని ఎక్కుపెట్టిన వారు కిందికి దించే వరకు పోరాటం చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అది ప్రాణాలు పోయినా సరే వెనుకడుగు వేసే పరిస్థితే లేదన్నారు. సోమవారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో నల్లమలలో యురేనియం తవ్వకాలకి వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "రెడ్ ఇండియన్లు వచ్చే ఏడు తరాల కోసం ఎలా ఉండాలి అని ఆలోచిస్తుంటే మనం ఏడు సంవత్సరాలను కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేం. ఇంత మంది మేధావులు, జడ్జిలు ఉన్నారు పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో మీరంతా ఓ ప్రణాళిక ఇవ్వండి. నేను ఏం చేయగలనో దిశానిర్ధేశం చేస్తే ప్రకృతి పరిరక్షణ కోసం ఓ సైనికుడి మాదిరి నేను మీతో కలసి ఒక అడుగు ముందుకి వేస్తాను. చివరి శ్వాస వరకు మీతో ఉంటాను. ఈ విషయంలో చొరవ తీసుకుని వి.హనుమంతురావు చేసిన కృషి అభినందనీయం. ఇది మనుషులు ఏకమవ్వాల్సిన సమయం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మీరు ఎలాంటి దిశానిర్ధేశం చేసినా మనస్ఫూర్తిగా స్వీకరిస్తాం.
సమస్యను వెలుగులోకి తెచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రాజకీయాలు నాకు తెలియదు. తెలంగాణ రాక ముందు దక్కన్ పీఠభూమి విధ్వంసానికి గురవుతుంటే ఎవరూ మాట్లాడడం లేదేంటని బాధ కలిగింది. అడవులు నాశనం అవుతూ, ఊర్లు కలుషితం అవుతుంటే మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు చూసి బాధ కలిగింది. ఆ బాధతో నా వంతు కృషి నేను చేద్దామని జనసేన పార్టీ స్థాపించా. జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించేలా అభివృద్ధి ప్రస్థానం ఉండాలి.
అందుకు తగినట్టు ముందుకి వెళ్తున్నాం. ఇది నా సమస్య కాదు రెండు వేల మంది చెంచుల సమస్య, లేదా తెలంగాణ సమస్య, ఆంధ్రా సమస్య అనుకునే పరిస్థితి కాదు. ఇది మనుషుల సమస్య. ఈ సమస్య మనది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పినట్టు సరదాగా కాఫీలు, చాయ్ లు తాగడానికి ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. సరదాగా ఇరానీ కేఫుల్లో కూర్చుని తాగుతాం తప్ప ఇంత సీరియస్ గా మేధోమధనం చేసే అవసరం ఏముంది.? చిల్లర రాజకీయాలు, పోరాటాలు మేం చేయం.
నేను ఈ రోజు కదలి రావడానికి హనుమంతరావు నా దగ్గరకు వచ్చేందుకు ముందే ఓ 17 ఏళ్ల చెంచు జాతి కుర్రాడు ఓ ఫైల్ తో నా దగ్గరకు వచ్చాడు. మా జీవితం ఛిద్రం అయిపోతోంది. ఎవరికి చెప్పాలో తెలియడం లేదు.
మా ఇళ్లు తీసేస్తామంటున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ కి ఫోన్ చేస్తే వారు పట్టించుకోవడం లేదు అంటూ తన వ్యధని వెళ్లబోసుకున్నాడు. 17 ఏళ్ల కుర్రాడికి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామన్న బాధ మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. జీవిత కాలంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకపోవచ్చేమోగాని, ఒకరి కన్నీరు తుడవగలిగితే నేను పార్టీ పెట్టినందుకు సార్ధకత ఏర్పడినట్టే.
ఇంత మంది మేధావులు హాజరవుతున్న ఈ సదస్సుకి సమస్య గురించి తెలుసుకోవడానికి వచ్చా. నాకు చేతనైన సహాయం చేయడానికి వచ్చా. నేను ఏం చేయాలో చెప్పి పాదయాత్ర చేద్దామన్నా వస్తాను. అడవుల్లో చెట్లు కొట్టేస్తుంటే ఆ చెట్టుని పట్టుకుంటే నీ తల కూడా తీసేస్తామన్నా అందుకు సిద్ధంగా ఉంటాను" అని అన్నారు.
యురేనియం తవ్వకాల అన్వేషణ కూడా నిలిపివేయాలి:
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ "నిన్న మొన్న ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలు చూస్తే యురేనియం వ్యవహారం కేవలం అన్వేషణ స్థాయిలో మాత్రమే ఉంది. మైనింగ్ స్టేజ్ లో లేదన్న భావన వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మండలిలో మంత్రి చేసిన ప్రకటనలు ఒక భరోసాగా భావించాలి. వాస్తవానికి 2016లో జరిగిన వైల్డ్ లైవ్ అడ్వయిజరీ బోర్డు సమావేశంలో ప్రభుత్వ అభ్యర్ధనతో యురేనియం మైనింగ్ కి సంబంధించి అనుమతి కోరడం జరిగింది.
అదే సమయంలో అంతా చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిరంతరంగా రాజకీయ మద్దతు తెలపాలన్న ఆలోచనతో పర్యావరణ ప్రేమికులుగా రాజకీయాలకు అతీతంగా సమావేశాలు ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో హనుమంతరావు గారి చొరవతో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ముందుకి వచ్చారు. చాలా మంది యువత సేవ్ నల్లమల అంటూ వారి సమయం వెచ్చించి యాక్టివిస్టులుగా మారడం ఆహ్వానించదగిన పరిణామం. గతంలో నేను స్పీకర్ గా ఉన్నప్పుడు చెంచుల జీవితాలు, కనీస మౌలిక సదుపాయాలు లేక వారి జీవితాలు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయో తెలిసి, యావత్ యంత్రాంగాన్ని తీసుకువెళ్లి అడవుల్లో పర్యటించి కొంత మేర న్యాయం చేయడం జరిగింది.
యురేనియం తవ్వకాల విషయానికి వస్తే నల్లమల అడవులు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం కాదు. కృష్టా పరివాహక ప్రాంతం మొత్తం ప్రభావితం అయ్యే పరిస్థితులను గత అనుభవాలు తెలియపరుస్తున్నాయి. రాజకీయ పార్టీలుగా మేం ఖచ్చితంగా ఈ ఇష్యూకి కట్టుబడి ఉంటాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు పవన్ కల్యాణ్ ముందుకు వచ్చినప్పుడు సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. అదే సమయంలో అక్కడ యురేనియం అన్వేషణ కూడా ఆపేస్తే అడవుల్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
ఈ చర్యలను అక్కడ గిరిజనులు వ్యతిరేకిస్తున్నప్పుడు వారిపై చర్యలు తీసుకోవడం మరింత ఆందోళనకర పరిస్థితులు, అపోహలకు కారణమవుతున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మంచినీటి కోసం ఎదురు చూస్తున్న ప్రాంతాలు, ఫ్లోరోసిస్ సమస్యలను ప్రస్తావించకుండా ఇలాంటి చర్యలకు దిగడం దురదృష్టకరం. ముఖ్యమంత్రి అన్వేషణ కోసం చేపట్టే తవ్వకాలు కూడా నిలిపివేయాలి అని కోరుతున్నాం" అన్నారు.
అమెరికా మాదిరి కఠినమైన మైనింగ్ చట్టాలు రావాలి: జస్టిస్ గోపాల గౌడ:
సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ మాట్లాడుతూ.. "ప్రజల కనీస సౌకర్యాలు అయిన కూడు, గూడు, వస్త్రం అందించాల్సిన ప్రభుత్వాలు .. జీవవైవిధ్యానికి ప్రమాదకరమైన యురేనియం తవ్వకాల్లో మునిగిపోయాయి. ప్రకృతి పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణను ప్రభుత్వాలు బాధ్యతయుతంగా తీసుకోవాలి. అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం, మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడరాదు. అమెరికాలో అమలవుతున్న కఠినమైన మైనింగ్ చట్టాలు మన దేశంలో కూడా రావాలి. ప్రమాదం జరిగితే వచ్చే బీమా కంటే ముందే ప్రజలను ఆదుకునేలా చట్టాలు ఉండాలి" అన్నారు.
యురేనియం మైనింగ్ కి కాంగ్రెస్ వ్యతిరేకం:
టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "తెలంగాణ రాష్ట్రంలో యురేనియం అన్వేషణకు గానీ, మైనింగ్ కి గానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. యురేనియం తవ్వకాలతో నల్లమలలో జీవవైవిధ్యం దెబ్బతింటుంది. యురేనియం తవ్వకాల వల్ల వెలువడిన అణుదార్మిక వాయువులు వల్ల, వ్యర్ధాలు నీళ్లలో కలవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇండియన్ న్యూ క్లియర్ పవర్ కు యురేనియం అవసరం అనుకుంటే చాలా దేశాల్లో చౌకగా లభిస్తుంది. ఆ దేశాల నుంచి కొనుగోలు చేయాలి తప్ప మైనింగ్ చేయడం మంచిది కాదు" అని చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ.. "యురేనియం ఇతరదేశాల్లో అయినా దొరుకుతుంది కానీ.. అడవులు దొరుకుతాయా..?. అడవులను తయారు చేయగలమా..?. దేశానికి అవసరమైతే యురేనియాన్ని దిగుమతి చేసుకోవాలి కానీ అడవులను నాశనం చేయకూడదు. యురేనియం తవ్వకాల వల్ల వెలువడిన అణుదార్మిక వాయువులతో మనుషులు క్యాన్సర్ , మూత్రపిండాల వ్యాధులు, మానసిక వ్యాధులకు గురవుతున్నారు. యురేనియం పరిశోధన, తవ్వకాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, భవిష్యత్‌లో ఇవ్వబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు కృతజ్ఞతలు. దేశానికి స్వతంత్రం వచ్చి 73 ఏళ్లు అయినా ఆదివాసుల పరిస్థితి మెరుగుపడలేదు.
ఒకప్పుడు 16వేల మంది ఉండే చెంచులు ఇప్పుడు 6వేల మందే ఉన్నారు. యురేనియం తవ్వకాలను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుంటాం. అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ , కిషన్ రెడ్డిలను కలుపుకొని జరగనున్న నష్టాలను కేంద్ర పెద్దలకు వివరిస్తాం. వైఎస్ హయాంలో కడప జిల్లా తమ్మలపల్లిలో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. యురేనియం శుద్ధిపరిశ్రమను కూడా స్థాపించారు. స్థానికులకు ఉద్యోగాల ఆశ చూసి జీవితాలతో చెలగాటం ఆడారు. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అక్కడ పర్యటించి, ప్రజల బాధలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను" అన్నారు.
తెలంగాణ శాసనసభ తీర్మానం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉంది:
మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా, యథేచ్చగా యురేనియం తవ్వకాలు చేపట్టవచ్చని 2016లో రాష్ట్ర ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చింది కనుకే కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారే ఛైర్మన్.
మూడేళ్ల క్రితం యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చి .. ఇప్పుడు ఉద్యమ తీవ్రతను తగ్గించి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శాసనసభ, మండలిలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చేది లేదని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ముఖ్యమంత్రిగారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నల్లమల అటవీ ప్రాంతాన్ని కాపాడాలన్న కోరిక ఉంటే స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేస్తున్నామని ఏకవాక్య తీర్మానం చేయాలి.
నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిగితే 1000 టీఎంసీల నీళ్లు, కోటి ఎకరాల వ్యవసాయం, 10కోట్ల ప్రజల తాగునీరు కలుషితమవుతుంది. ప్రగతి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేసి యురేనియాన్ని వెలికితీయడం సబబు కాదని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతం, కడప జిల్లా తుమ్మలపల్లిలో పవన్ కల్యాణ్ పత్యక్షంగా పర్యటించి ప్రజల పడుతున్న బాధలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అన్నారు.
యురేనియం తవ్వకాలు, పరిశోధనలు సంపూర్ణంగా నిలిపివేయాలి:
తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రోఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... "యురేనియం అనేది అత్యంత ప్రమాదకరమైన దాతువు. అది భూమిలో నిక్షిప్తం అయినంత వరకు ప్రమాదం లేదు. బయటికి వస్తే తీవ్రమైన రేడియో ధార్మికత వెలువరుస్తుంది. అందుకే యురేనియం తవ్వకాలుగాని, పరిశోధనలు గాని జరగడానికి వీలులేదని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అయ్యింది.
నల్లమల అనేది ఓ ప్రత్యేకమైన పర్యావరణ, జీవావరణ వ్యవస్థ. అది నాశనం అయితే వచ్చే నష్టాలు దారుణంగా ఉంటాయి. అందుకే ఈ వ్యవహారంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలా అని మిగిలిన ప్రాంతాల్లో తవ్వేందుకు అంగీకరించినట్టు కాదు. ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం సాధించుకోగలిగాం. ఇక్కడి నుంచి చేయాల్సిందే కీలకం. ప్రభుత్వం చేసిన తీర్మానం విశ్వాసం పెంచుతుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఇంకాస్త ప్రయత్నం చేస్తే సంపూర్ణ ఫలితాన్ని సాధించవచ్చు.
సమావేశంలో మనమంతా ఒక తీర్మానం చేయాలి. యురేనియం తవ్వకాలు, పరిశోధనలు సంపూర్ణంగా నిలిపివేయాలి. అందుకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు రద్దు చేయాలి. ఈ మేరకు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి" అని డిమాండ్ చేశారు.
ఎలాంటి పోరాటానికైనా సిపిఎం మద్దతు:
మాజీ శాసనమండలి సభ్యులు, సిపిఎం నాయకులు సీతారాములు మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాలతో వస్తున్న ఇబ్బందులపై కొద్ది రోజులుగా పత్రికల్లో వస్తున్న వివరాలతో కూడిన సమాచారం ఆధారంగా పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతాన్ని సందర్శించి దాని వల్ల వాటిల్లే నష్టాలను ప్రజల ముందు ఉంచడం జరిగింది.
మా పార్టీ తరఫున ఓ బృందం పర్యటించడం జరిగింది. అంతా కదలడంతో ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వం అని చెప్పారు. కేంద్రంపై పోరాటం చేస్తామని చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నా వారు చేసిన వ్యాఖ్యలే ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రజల తరఫున చేస్తున్న పోరాటాల్ని సమర్ధించాల్సింది పోయి. ఇంత భయపెట్టాల్సిన అవసరం ఉందా అంటూ చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అన్ని రాజకీయ పార్టీలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధుల్ని ఒక వేదిక మీదకి తెచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కాబట్టి మన స్పందన తగ్గితే పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. మనమంతా మరింత చొరవతో ఉద్యమించాలి. ఎలాంటి పోరాటానికైనా మా పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తాం అని తెలిపారు.
పర్యావరణవేత్త బాబురావు మాట్లాడుతూ.. మన దేశ విద్యుత్ అవసరాలకు అణు విద్యుత్ ఏమాత్రం సరిపోదనీ, ప్రమాదకరమనీ, ఖర్చు కూడా ఎక్కువే. 60 ఏళ్లుగా భారతదేశంలో వచ్చిన అణువిద్యుత్ కేవలం 6,780 మెగావాట్లే. మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో అది 1.9 శాతమే. ఇంత తక్కువ ఉన్న అణు విద్యుత్‌ను భారత్ భవిష్యత్ అవసరాలను తీర్చేలా విస్తృత పరుస్తున్నామనడం సరికాదు. యురేనియం తవ్వడం, విద్యుత్ తయారీకి వాడడం, ఆ వ్యర్థాలను నిల్వ చేయడం ఇలా ప్రతి దశలోనూ అది సమస్యే. తీసిన యురేనియాన్ని ఎలా కాపాడాలి? ఎక్కడ దాచి పెట్టాలి? ప్రమాదరహితంగా ఎలా చేయాలనేదానిపై ఇప్పటివరకు స్పష్టమైన పరిజ్ఞానం లేదు.
పైగా ఎక్కడ తవ్వినా ప్రతి చోటా విషాదమే. కడపలో అక్కడి స్థానికుల సమస్యలను యురేనియం కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు" అన్నారు. నల్లమల చెంచుల ప్రతినిధిగా వచ్చిన సార్లపల్లి గ్రామా సర్పంచ్ మల్లికార్జున్ మాట్లాడుతూ "చెంచుల జీవన విధానాన్ని, అస్తిత్వాన్ని దెబ్బ తీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. నల్లమల అడవి, అక్కడి జీవాలు మాకు దైవంతో సమానం. ప్రతి చెట్టు, జంతువూ మా జీవనంలో భాగం. ఇప్పుడు యురేనియం తవ్వకాలతో మా బతుకులు ఏం చేస్తారు" అని ప్రశ్నించారు.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి అతిధులని పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆహ్వానం పలికారు. సమావేశంలో సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డితోపాటు శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, పాత్రికేయులు సజయ, పాశం యాదగిరి, నరసింహారెడ్డి, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, సహా 23 మంది ప్రసంగించారు.