'నీరా కేఫ్' నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా "నీరా కేఫ్" నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు దేశంలోనే అత్యుత్తమ నీరా పాలసీని రూపొందించి రాష్ట్రంలో ఉన్న గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్య ప్రదాయిని నీరా, అనుబంధ ఉత్పత్తుల అమ్మకాల కేంద్రం 'నీరా కేఫ్' కు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ జలాశయం వెంట ఉన్న నెక్లెస్ రోడ్డు లో నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
దేశంలొనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా నీరా కేఫ్ నిర్మాణ పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనుల నాణ్యత ను, పనులను పరిశీలించారు. నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి పనులను వేగవంతం చేయాలని కోరారు. వచ్చే నవంబర్ లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
వీటితోపాటు యాదాద్రి - భువనగిరి జిల్లాలోని నందన వనంలో నిర్మిస్తున్న ప్రతిపాదిత నీరా ఉత్పత్తి, నీరా అనుబంధ ఉత్పత్తుల అధ్యాయన కేంద్రం పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో నీరా కేఫ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.