మెరుగైన వంగడాల ఉత్పత్తి అత్యావశ్యకం: ఏపీ గవర్నర్
- ఘనంగా ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
- విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో పాల్గొన్న గవర్నర్
మంగళవారం తిరుపతి వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో సందేశం ఇచ్చిన గవర్నర్ బోధన, పరిశోధన, విస్తరణలో వేగంగా అడుగులు వేయటం ద్వారా ప్రపంచ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మారాలన్నారు.
బోధకుల నైపుణ్యాలు ఎప్పటికప్పుడు మెరుగవ్వాలని, పరిశోధనలో నైపుణ్యాన్ని సాధించడం కీలకమన్నారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ద్వారా 2019 సంవత్సరానికి జాతీయ స్దాయిలో ఈ విశ్వవిద్యాయం 13వ ర్యాంకు సాధించటం శుభ పరిణామమన్నారు. రైతులు సులభంగా స్వీకరించగలిగేలా తక్కువ ధరకు వ్యవసాయ సాంకేతిక ఉపకరణాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా పరిశోధకులు ప్రయత్నించాలన్నారు.
జాతీయ స్థాయిలో ఆహార భద్రతకు ఉన్న డిమాండ్‌కి అనుగుణంగా, సాగు భూమి విస్తరణ పరిధి తక్కువగా ఉన్న నేపథ్యంలో పంట ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందని బిశ్వభూషణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తెగుళ్లు, వ్యాధులను ఎదుర్కునే లక్షణాలతో అధిక దిగుబడి సామర్థ్యం కలిగిన నూతన వంగడాలను రూపొందించ వలసిన ఆవశ్యకత ఉందన్నారు.
ఆహారం, వ్యవసాయ సంస్ధ (ఎఫ్ ఎ ఓ) తాజా గణాంకాల ప్రకారం మన జనాభాలో దాదాపు 14శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారని, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 20శాతం మంది తక్కువ బరువు కలిగి ఉన్నారని, పునరుత్పత్తి వయస్సులో 51.4శాతం మంది మహిళలు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారని గవర్నర్ గుర్తు చేశారు. పోషకాహారలోపాన్ని అధిగమించేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పంటల బయో-ఫోర్టిఫికేషన్‌పై పరిశోధనలు చేయవలసి ఉందన్నారు.
వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని సాధించడానికి, సమీకృత వ్యవసాయ విధానాలు, వ్యవసాయ యాంత్రీకరణ విభాగాలలో పరిశోధన చేయడం చాలా అవసరమని ఫుడ్ ప్రాసెసింగ్, నీటి సమర్ధ వినియోగ సాంకేతికత, పంట దిగుబడులను మెరుగుపరచడం, వ్యవసాయం, వ్యవసాయేతర రంగం మధ్య సంబంధాలను పెంచడం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు.
మెరుగైన పంట ఉత్పాదకత, వనరుల పునర్వినియోగం, ఉత్పాదక వ్యయాల తగ్గింపు, సమర్థవంతమైన వనరుల వినియోగం, పంటల వైవిధ్యతతో నష్టాల తగ్గింపు, మెరుగైన వ్యవసాయ ఆదాయం తద్వారా జీవన ప్రమాణాల మెరుగుదలకు పరిశోధనలపై మరింత దృష్టి సారించాలని గవర్నర్ పిలుపు నిచ్చారు. తమ కెరీర్‌ని అద్భుతంగా ప్రారంభించాలని కోరుకునే విద్యార్థులకు స్నాతకోత్సవం ఒక ప్రత్యేకమైన రోజన్న గవర్నర్ వ్యవసాయ రంగంలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని మరోవైపు సమాజానికి దేశానికి మేలు చేస్తూ ఈ రంగంలో సంతృప్తిని పొందగలుగుతారని వివరించారు.
విద్యార్థులు ఎంచుకున్న ఆయా ప్రత్యేక రంగాలలో నిరంతర ప్రాతిపదికన జ్ఞానాన్ని పొందే అలవాటును పెంపొందించుకోవాలన్నారు. నిజాయితీ, నీతి అనేవి పరిశోధన ఫలితాలను నివేదించేటప్పుడు, ప్రచురించేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలన్నారు. విద్యర్ధులు తమ ఎదుగుదల కోసం దగ్డరి మార్గాల వైపు చూడవద్దని కోరారు. ప్రభుత్వం ద్వారా ఈ విశ్వ విద్యాలయం అనేక జాతీయ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటం శుభపరిణామమని ఇది మరింత పెద్దఎత్తున కొనసాగాలని ఆకాంక్షించారు.
స్నాతకోత్సవం జరిగిన తిరుపతి నుండి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఎ విష్ణు వర్ధన్ రెడ్డి, స్దానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనగా, రాజ్ భవన్ నుండి గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, విశ్వ విద్యాలయ ప్రతినిధులు డాక్టర్ వి. చెంగారెడ్డి, డాక్టర్ చెరుకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.