తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్న తెలంగాణ అటవీ శాఖ
హైదరాబాద్: విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ నిఘా విభాగం హైదరాబాద్, రామంతపూర్ లో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి 330 తాబేళ్లను పట్టుకుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ ఒకటిలో తాబేళ్లు కూడా ఉన్నాయి. వీటిని పట్టుకోవటం, తరలించటం, అమ్మటం నేరం. ఇండియన్ టెంట్ లేదా అస్సాం రూఫుడ్ టార్టయిస్ గా పిలిచే ఈ తాబేళ్లు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్ లక్నోకు చెందిన శివ బాలక్, రాహుల్ కాశ్యప్ లను అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకున్నారు. లక్నో సమీపంలో గోమతి నదిలో వీటిని పట్టుకుని రైళ్ల ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. గతంలో చాలా సార్లు ఇలా చేసినట్లు సమాచారం. విజిలెన్స్ టీమ్ కొనుగోలుదారులుగా వెళ్లి పట్టుకున్నారు. పట్టుకున్న ఇద్దరినీ మేడ్చల్ జిల్లా ఉప్పల్ రేంజ్ అధికారికి అప్పజెప్పారు.
తదుపరి విచారణ పోలీసుల ద్వారా కొనసాగుతుందని విజిలెన్స్ అధికారి రాజా రమణా రెడ్డి తెలిపారు. ఉత్తర ప్రదేశ్ నుంచి రైలు ద్వారా ఇలా తాబేళ్లను తరలిస్తూ హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు సమాచారం. నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయాల వరకు వీటిని అమ్ముతున్నారు. పెట్ షాపులు, ఆక్వేరియం షాపుల నిర్వాహకులు వీటిని కొంటున్నట్లు తెలిసింది. తాబేళ్లను కొనటం, అమ్మటం కూడా నిషేధమని, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ షాపుల నిర్వాహకులను అటవీశాఖ హెచ్చరించింది. అలాగే తాబేళ్లను ఇళ్లలో పెంచుకోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.
తాబేళ్లను తరలించి అమ్ముతున్న విధానంపై తదుపరి విచారణ కోసం వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి పీసీసీఎఫ్ ఆర్ శోభ లేఖ రాయనున్నారు.
పీసీసీఎఫ్ (విజిలెన్స్) స్వర్గం శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరగింది. రమేష్ కుమార్, రేంజ్ అధికారి (యాంటీ పోచింగ్ టీమ్), జీ. సీతారాములు, వాహెద్, శ్రీనివాసులు, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.