అర్హులందరికీ 'నేతన్న నేస్తం': ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు
- ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
- చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు, ఉత్పత్తి ధరలకే విక్రయాలు
ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని, అధికారులు జిల్లాల వారీగా అర్హులు, అనర్హుల జాబితాలను రూపొందించి ఏ కారణం చేత అనర్హులుగా పరిగణించారన్న విషయాన్ని స్పష్టంగా రికార్డు చేయాలని సూచించారు. చేనేతల సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగానే గడిచిన రెండేళ్లలో నేత కార్మికుల సంక్షేమం కోసం సుమారు రూ.600 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.
చేనేతలకు ఆర్ధిక బాధల నుంచి విముక్తి కల్పించాలన్న సదుద్దేశ్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారని, ఆయన ఆశయాలను నెరవేర్చడంలో భాగంగా అర్హులైన నేత కార్మికులను గుర్తించి నేతన్న నేస్తం వర్తింపజేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. చేనేత జౌళిశాఖ సంచాలకులు పడాల అర్జునరావు మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆప్కో ఆధ్వర్యాన ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక వస్త్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించి కార్యక్రమాలను నిర్వహించాలని చేనేత, జౌళిశాఖ అధికారులకు సూచించారు. ఈ ప్రదర్శనల్లో అధునాతన డిజైన్లతో రూపొందించిన అన్నీ రకాల వస్త్రాలను ఉత్పత్తి ధరలకే విక్రయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆప్కో జీఎం లేళ్ల రమేష్ బాబు, చేనేత జౌళిశాఖ సంయుక్త సంచాలకులు ఎం. నాగేశ్వరరావు, కే. కన్నబాబు, ఉపసంచాలకులు టీజె ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.