రవీంద్రభారతిలో సినారెకు ఘనంగా నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రముఖ కవి, సాహితి వేత్త డా. సి.నారాయణ రెడ్డి 90వ జయంతి కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, డా. సి. నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, గంధం రాములు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణకు చెందిన మహనీయులు, కవులు, సాహితీ వేత్తలు, సామాజిక వేత్తలను గుర్తించి వారి జయంతి, వర్ధంతిలను తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ప్రభుత్వం తరుపున ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ కి డా. సి. నారాయణ రెడ్డి రచనలు ఎంతో ఇష్టమన్నారు. సినారె అంత్యక్రియలలో పాల్గొని స్వయంగా పాడే మోసి వారి పట్ల ఉన్న అభిమానాన్ని చాటారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
సినారె పేరుతో "సినారె సారస్వత సదనం" నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. డా. సి. నారాయణ రెడ్డి కవిగా, సినీగీత రచయితగా పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్ఠం చేశారన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని గంగా జమునా తహజీబ్ కు ప్రతీకగా నిలిపారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా వివిధ యూనివర్సిటీలకు వైస్ చాన్సులర్ లుగా ఆయన అందించిన సేవలను కొనియాడారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి డా. సినారె కుటుంబ సభ్యులను సన్మానించారు.