ఫుడ్ కోర్ట్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్
విజయవాడ: నగరంలోని బందరు రోడ్డు ఇందిరగాంధీ స్టేడియం వద్దనున్న పుడ్ కోర్టు ఆధునికీకరణ పనులను వచ్చే నెల 15వ తేదీ లోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ అధికారులతో కలిసి పనులు పరిశీలించారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం వేడుకలను స్టేడియం ఆవరణలో నిర్వహించనున్నందున ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు గాను ఫుడ్ కోర్ట్ ఆధునికీకరణ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
కెనాల్ వ్యూ పార్క్ పనులను పరిశీలించిన కమిషనర్:
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదురుగా కాలువ వెంబడి చేపటిన గ్రీనరి, అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. కెనాల్ వ్యూ పార్క్ లో సివిల్ పనులు పూర్తి చేయాలని, నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చే సందర్శకులకు ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలతో తీర్చిదిద్దాలని అన్నారు.
కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ యం. ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, ఉద్యానవన అధికారి జె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు 'దిశ'తో అభయం: కమిషనర్ ప్రసన్న వెంకటేష్
మహిళల భద్రతకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారని, అందులో భాగంగా దిశ యాప్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని సచివాలయం సిబ్బందికి నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు.
సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నీసాతో కమిషనర్ పాల్గొన్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయంపై అవగాహన కల్పించారు. ఆపద వచ్చినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వివరించారు. స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలన్నారు. ఫోన్‌లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టేనని.. ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని అన్నారు.