అడవులకు నష్టం జరగకుండా శాస్త్రీయ పద్దతుల్లో ఫలసాయం పొందటంపై గిరిజనులకు శిక్షణ
- గిరిజనులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించిన ఫారెస్ట్ కాలేజీ, గిరిజన కార్పోరేషన్
చిన్న తరహా అటవీ ఫలసాయాల సేకరణలో శాస్త్రీయ సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ అడవికి, చెట్లకు హాని కల్గించకుండా, మంచి నాణ్యత గల ఫలసాయాలను సేకరించటం, అధిక ఆదాయం పొందడంపై గిరిజనులకు ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. అడవుల నుంచి వివిధ రకాల ఉత్పత్తులను సేకరించటంలో భాగంగా నిప్పుపెట్టడం, చెట్లు కొట్టేయటం, వన్యప్రాణులకు హాని చేయటం లాంటి కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదని తెలిపారు.
ఈ శిక్షణ కార్యకమంలో భద్రాచలం, ఉట్నూర్, ఏటూర్ నాగారం, మన్ననూర్ ఐటీడీఏలలో గల 17 వన్ ధన్ వికాస కేంద్రాలకు (వీడీవీకే)లకు చెందిన 50 మంది గిరిజనులు మరియు జీసీసీ తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఫీల్డ్ అధికారులు హాజరయ్యారు. వీరందరూ కూడా జులై 19 నుంచి క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో తమ ప్రాంతాల్లో ఉన్న వన్ ధన్ వికాస కేంద్రాల (వీడీవీకే) పరిధిలో మిగతా గిరిజన సభ్యులందరికీ శిక్షణ ఇస్తారు.
అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ డీన్ ప్రియాంక వర్గీస్ కార్యక్రమాన్ని సమన్యయ పరిచారు. ఈ కార్యక్రమంలో అటవీ కళాశాల, పరిశోధన సంస్థ అధికారులతో పాటు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ, గిరిజన మార్కెటింగ్ అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొని వన్ ధన్ ప్రాజెక్ట్ వివరాలను శిక్షణలో పాల్గొన్న గిరిజనులకు తెలిపారు.