కరోనాతో మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.2లక్షల ఆర్థిక సాయం: అల్లం నారాయణ

Related image

హైదరాబాద్: కరోనాతో మరణించిన జర్నలిస్ట్ లకు సంబంధించిన కుటుంబాల వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

జర్నలిస్ట్ ల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం 2 లక్షల రూపాయలు పొందడానికి కోవిడ్-19తో మరణించిన అర్హత గల జర్నలిస్ట్ ల కుటుంబాల వారు జూలై 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. కోవిడ్-19తో మరణించిన కుటుంబాలకు గతంలో మాదిరిగానే 5 ఏళ్ల పాటు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది. అంతేగాక మరణించిన జర్నలిస్ట్ కుటుంబంలో 10వ తరగతిలోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి ఒక వేయి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందిస్తామని ఆయన తెలిపారు.

కోవిడ్-19తో మరణించిన జర్నలిస్ట్ లకు సంబంధించిన కుటుంబ సభ్యులు దరఖాస్తుతో పాటు అక్రిడిటేషన్ కార్డు, ఐడి కార్డు, ఆధార్ కార్డు, రెండు లక్షల లోపు ఆదాయ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్, బ్యాంకు పాసు పుస్తకము, మూడు ఫోటోలు, జిల్లా వైద్యాధికారిచే కోవిడ్-19 మరణ ధృవీకరణ పత్రం జతచేయాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి స్వయంగా గాని, పోస్ట్ ద్వారా గాని ఈ నెల 25వ తేదీ వరకు పంపించాలన్నారు.

గతంలో జర్నలిస్ట్ ల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.

పూర్తి చేసిన దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్‌ చిరునామా: ఇంటి నెం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి. గార్డ్స్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాదుకు పంపవలసిందిగా ఆయన తెలియజేశారు.

ఇతర వివరాలకు 7702526489 ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు.

Corona Virus
Telangana

More Press Releases