ఆర్గానిక్ నూలు, సహజసిద్ధమైన రంగులతో ఆప్కో వస్త్రాలు: ఛైర్మన్ చిల్లపల్లి
- నూతన డిజైన్ల విషయంలో జిల్లాకు 100 మందికి ప్రత్యేక శిక్షణ
- సంఘాల నుండి రూ.15 కోట్ల విలువైన వస్త్రాల కోనుగోలు
- ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ
- నూతనంగా ఆప్కో షోరూమ్ లు, ఆధునీకరణ
45 సంవత్సరాల క్రితం 1976 జులై ఆరవ తేదీన ఆంద్రా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మూడు సొసైటీల కలయికగా ఆంధ్రప్రదేశ్ హ్యండ్ లూమ్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఏర్పాటై ఆప్కోగా రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చూరగొంది. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ ఆర్గానిక్ యార్న్ ఆధారంగా వేప, గంధం, కమలా, నారింజ, దానిమ్మ ఫలాలు, కరక్కాయ ద్వారా లభించే సహజసిద్దమైన రంగులను వినియోగించి ఈ తరహా వస్త్రాలకు రూపకల్పన చేస్తున్నామన్నారు. ప్రవేటు రంగం పోటీని తట్టుకుని వినియోగదారులకు మరింత మెరుగైన డిజైన్లను అందించే క్రమంలో కార్మికులకు ఆప్కో ప్రత్యేక శిక్షణను సైతం ఇవ్వనుందన్నారు. ప్రతి జిల్లాలోనూ గరిష్టంగా వందమందికి ఆధునిక డిజైన్ల రూపకల్పనలో సులువైన మార్గాల గురించి మాస్టర్ వీవర్స్ తో శిక్షణ ఇప్పిస్తామన్నారు.
ఆప్కో ద్వారా ఎగుమతులను ప్రోత్స హించే క్రమంలో చెన్నైలోని చేతి వృత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్ధ ప్రతినిధులను ఈ నెల 14 తేదీన సంస్ధ ఎండీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తాను కలవనున్నామని, వారితో భేటీ అనంతరం ఈ విషయంపై కూడా తగిన ప్రణాళిక రూపొందిస్తామని చిల్లపల్లి వివరించారు. రాష్ట్రంలోని తిరుపతి, ఓంగోలు, కడప, గుంటూరులో నూతన ఆప్కో విక్రయ శాలలను ఏర్పాటు చేయనున్నామన్నారు.
మరోవైపు 20కి పైగా విక్రయశాలలను పూర్తి స్దాయిలో ఆధునీకరించి వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా కార్యాచరణ సిద్దం చేసామన్నారు. ఇప్పటికే ఆర్టిసి ప్రయాణ ప్రాంగణాలలో షోరూమ్ ల ఏర్పాటుకు అనుమతులు లభించాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో అమలు చేస్తున్న నేతన్న నేస్తం ద్వారా నేత కార్మికులు ఇతోధికంగా వృద్ది చెందేలా తగిన సూచనలు అందిస్తున్నామని, కరోనా నేపథ్యంలో వివిధ సంఘాల వద్ద నిల్వ ఉన్న రూ.15 కోట్ల విలువైన వస్త్ర సంపదను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి, చేనేత జౌళి శాఖ మంత్రి అనుమతి ఇచ్చారని త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభం కానుందని చిల్లపల్లి వెంకట నాగ మోహన రావు వివరించారు.