అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని నిర్వహిస్తాం: మంత్రి తలసాని
హైదరాబాద్: ఈ నెల 13న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణంను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై ఆలయం ఆవరణలో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తులాభారాన్ని మంత్రి ప్రారంభించారు.
నూతనంగా నియమించబడిన ఆలయ కమిటీ సభ్యులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12న ఎదుర్కోళ్ళు, 13న కల్యాణం, 14 న రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కల్యాణం రోజున ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు చెప్పారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అమ్మవారి కల్యాణం ఆలయం లోపల నిరాడంబరంగా నిర్వహించడం జరిగిందని, ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని శాఖల ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అమ్మవారి కల్యాణం సందర్భంగా బల్కంపేట ఆలయానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పటిష్టమైన భారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా ఉత్సవాలు నిర్వహించే మూడు రోజుల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. అమ్మవారి రథోత్సవం నిర్వహించే రహదారులలో ఎలాంటి గుంటలు లేకుండా చూడాలని, అవసరమైన ప్రాంతాలలో యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని జోనల్ కమిషనర్ ప్రావిణ్యను మంత్రి ఆదేశించారు.
ఆలయ పరిసరాలలో ఎక్కడా డ్రైనేజి లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలలో భక్తుల రద్దీను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా ట్రాపిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాపిక్ ఆంక్షల అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆలయానికి వచ్చే రహదారులలో అవసరమైన ప్రాంతాలలో భారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాపిక్ డైవర్షన్ చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.
భక్తుల సౌకర్యార్ధం ఆలయ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్యూ లైన్ లలో వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు లక్ష వాటర్ ప్యాకెట్స్ ను అందుబాటులో ఉంచాలని, వాటర్ ట్యాంకర్లను సిద్దంగా ఉంచుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. సాంస్కృతిక శాఖ కళాకారులచే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మంత్రికి వివరించారు.
సమావేశంలో జోనల్ కమిషనర్ ప్రావిణ్య, కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, ఆర్&బీ ఎస్ఈ పద్మనాభరావు, ఐ&పీఆర్ సీఐఈ రాధాకృష్ణ, ఆలయ ఈఓ అన్నపూర్ణ, కల్చరల్ డైరెక్టర్ హరికృష్ణ, వాటర్ వర్క్స్ జీఎం ప్రభు, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.