గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనంతో వెల్లివిరియాలి: మంత్రి ఎర్రబెల్లి

Related image

హైదరాబాద్: గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనంతో వెల్లివిరియాలని, అభివృద్ధిలో ముందంజలో నిలవాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని డబిల్ పూర్ గ్రామంలో శుక్రవారం నాడు జరిగిన పల్లె ప్రగతి గ్రామా సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొని కష్టపడి పనిచేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నారు. దీనితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం జరగని అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఆయన తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. పుట్టి పెరిగిన ఊరి రుణం ప్రతి ఒక్కరు తీర్చుకోవాలని ఆయన కోరారు.

రాష్ట్రంలోని గ్రామలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే సంకల్పంతో ప్రతి నెల గ్రాంట్ ను గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్రంలోని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి 2019 సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు 6500 కోట్ల రూపాయలను గ్రామాలకు గ్రాంటుగా మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ప్రతినెల 7 లక్షల రూపాయలు డబిల్ పూర్ గ్రామానికి గ్రాంటుగా మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామ పంచాయితీలకు అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధుల కొరత లేదని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు మిషన్ భగీరథ పథకం క్రింద 40వేల కోట్ల రూపాయల వ్యయంతో స్వచ్ఛమైన త్రాగు నీటిని అందింస్తున్నామని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే డబిల్ పూర్ లో దాదాపు 1కోటి రూపాయల వ్యయంతో మిషన్ భగీరథ పథకం క్రింద స్వచ్ఛమైన త్రాగునీటిని గ్రామానికంతటికి సరఫరా చేస్తున్నామని ఆయన కోరారు. గతంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగీ,మలేరియా లాంటి వ్యాధులు వచ్చాయని పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వలన సీజనల్ వ్యాధులు, ఇతర వ్యాధులు పూర్తిగా అరికట్టబడ్డాయని మంత్రి అన్నారు.

డబిల్ పుర్ గ్రామంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరి ఉపాధికి కనీసం 3 లక్షల రూపాయల ఋణం అందించేలా శ్రీనిధి, ఇందిరాకాంతి పథకం క్రింద కార్యాచరణ, ప్రణాళిక తయారుచేసి ఆమోదం కోసం పంపించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. డబిల్ పూర్ గ్రామం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచినందుకు డబిల్ పూర్ గ్రామ కార్యదర్శిని, సర్పంచ్ ని మంత్రి అభినందించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా డబిల్ పూర్ గ్రామం అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర కార్మిక,ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాష్టంలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారని, గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు చిత్తశుద్ధితో పని చేస్తున్నదని ఆయన అన్నారు. తెలంగాణలో హరితహారం పథకంలో నాటిన మొక్కలకు నీరు అందించడానికి, గ్రామాలలో తడి, పొడి చెత్తలు తరలించడానికి ట్రాక్టర్లు, ట్రాలీలు,ట్యాంక‌ర్లు అన్ని గ్రామ పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందని అయన అన్నారు. రాజకీయాలకతీతంగా గ్రామ ప్రజలు గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.

2018 సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పంచాయితీరాజ్ యాక్ట్ వల్ల గ్రామ సర్పంచులకు, అధికారులతో పాటు బాధ్యతలు పెరిగాయని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గ్రామంలో ప్రతిరోజూ వేకువజామున తడి, పొడి చెత్త ట్రాక్టర్ల సహాయంతో సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అయన కోరారు. పచ్చదనం పెంపొందించడానికి ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణి చేస్తున్నామని ఆయన అన్నారు. నాటిన ప్రతి మొక్క సంరక్షించే విధంగా చర్యలు గైకొనాలని ఆయన కోరారు.

పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలు జరుగుతున్నదని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి అన్నారు. ప్రతి వ్యక్తి  తమ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో అదే విధంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె కోరారు. గ్రామంలోని జిల్లా పరిషత్ మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతున్నందుకు గ్రామ సర్పంచ్ ను, హెడ్ మాస్టర్ ను ఆమె అభినందించారు. డబిల్ పూర్ గ్రామ సర్పంచ్ భాగ్య రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. గ్రామ పంచాయితీ కార్యదర్శి శోభ రాణి గ్రామ అభివృద్ధిపై నివేదిక చదివారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాoసన్, ఎంపిపి శైలాజ, జిల్లా అధికారులు, మండల, గ్రామ స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అంతకు ముందు డబిల్ పూర్ గ్రామంలో 22 లక్షల రూపాయల వ్యయంతో వేయనున్న సిసి రోడ్డును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పాఠశాల లైబ్రరీని, డైనింగ్ హాలును మంత్రులు ప్రారంభించారు.

More Press Releases