పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్: గ్రామాలలో పచ్చదనం వెల్లివిరియాలని పారిశుధ్ధ్యం, అభివృద్ది కార్యక్రమాలలో ముందంజలో నిలవాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ప్రారంభించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరు పాల్గొని కష్టపడి పనిచేస్తే  గ్రామాలు అభివృద్ధి మార్గంలో పయనిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో నానాజిపూర్ గ్రామంలో నిర్వహించిన నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో స్ధానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తో పాటు స్ధానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామసభలో స్వచ్ఛ ప్రతిజ్ఞ అనంతరం ప్రగతి నివేదికను చదివిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు పచ్చదనం కోసం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని, పది రోజుల పాటు జరుగుతాయని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కష్టపడి పనిచేస్తే గ్రామాలు శుభ్రంగా తయారవుతాయని ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అని అన్నారు.

గ్రామాలలో సర్పంచులు, కార్యదర్శులు ప్రతి రోజు పారిశుధ్ధ్య కార్యక్రమాలను ఉదయం పర్యవేక్షించాలని, గ్రామం మొత్తం తిరగాలని వీధులతో పాటు డ్రైయిన్లను శుభ్రపరచాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా మంచి నీటి సరఫరా ద్వారా ఏవిధమైన వ్యాధులు ప్రబలడం లేదన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గాయన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లు ఉన్నందున ఎవరిమీద ఆధారపడవలసిన అవసరం లేదన్నారు. హరతహారం ద్వారా గ్రామంలో బాగా మొక్కలు నాటారని, నర్సరీ బాగుందని, స్ధానిక అవసరాలకు దీని ద్వారా మొక్కలు సమకూర్చుకోవాలని అంటూ ఈ సారి ప్రతి ఇంటికి వారి ఇంటివద్దే ఆరు మొక్కలను అందజేస్తున్నామని, తద్వారా  గ్రామం మొత్తం పచ్చదనంతో వెల్లివిరియాలని ముఖ్యమంత్రి గారి ఉద్ధ్యేశ్యమని అన్నారు.

గ్రామంలో నీరు నిలిచే ప్రదేశాలు లేకుండా చూడాలని, డ్రై డే ను నిర్వహించాలని దీని ద్వారా మలేరియా, డెంగ్యూ లు రావని అన్నారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంను వాడుకలోకి తీసుకురావాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు సత్వరం విడుదల చేస్తున్నామన్నారు. గ్రామస్ధుల కోరిక మేరకు సిసి రోడ్ ను మంజూరు చేస్తూ త్వరితగతిన పని పూర్తి చేయాలన్నారు. తడి పొడి చెత్తను వేరు చేయాలని సెగ్రిగేషన్ షెడ్ ను వాడాలని అన్నారు.

దళితులలో పేదరిక నిర్మూలనకు వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళిత్ ఎంపవర్ మెంట్ స్కీం కు రూపకల్పన చేశారని ప్రజా ప్రతినిధులు అధికారులతో దాదాపు పది గంటలు సమావేశం నిర్వహించారని, ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున 10 లక్షల రూపాయాలను రైతు బంధు తరహాలో వారి అకౌంటులో జమచేసేలా కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారని, ఈ ఫథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో జారీ అవుతాయన్నారు. నిరుద్యోగులు, పేద దళితులు పేదరికం నుండి బయటపడేలా సహాయం అందుతుందన్నారు. గ్రామలలో దళిత వాడలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలన్నారు.

గ్రామ సభ అనంతరం వైకుంఠధామాన్ని సందర్శించి పచ్చదనం పెంపుకు సూచనలు చేయడంతో పాటు దళిత వాడలో మొక్కలు నాటారు. పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కను నాటడంతో పాటు అధికారులను అభినందించారు.

రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి. ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు తమ నియోజకవర్గంలో గ్రామంలోని పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తపరుస్తూ ముఖ్యమంత్రి గారు ఆశించిన మేరకు గ్రామ అభివృద్ధికి పచ్చదనం, పారిశ్యుధ్ధ్యం మెరుగుదలకు అందరు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతీప్ జైన్, ఆర్డిఓ చంద్రకళ, గ్రామసర్పంచ్ కల్పన, జెడ్ పిటిసి తన్వీరాజ్, ఎంపిపి జయమ్మ, వైస్ ఎంపిపి నీలా మొహన్ నాయక్, ఎంపిటిసి కాంతి కుమార్ లు పాల్గొన్నారు. 

Palle Pragathi Programme
Somesh Kumar
Hyderabad
Telangana

More Press Releases