వచ్చేవారం నుండి జంట నగరాల పరిధిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి తలసాని
హైదరాబాద్: జంట నగరాల పరిధిలోని అర్హులైన పేదలకు వచ్చే వారం నుండి నూతన రేషన్ కార్డ్ లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో రేషన్ కార్డ్ ల పంపిణీపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ శ్వేతా మహంతి, చీఫ్ రేషనింగ్ అధికారి బాల మాయాదేవి, హైదరాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి రమేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా పరిధిలో నూతన రేషన్ కార్డ్ ల కోసం 1.77 లక్షల దరఖాస్తులు రాగా, 44,734 కార్డులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 5,353 కార్డ్ లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని, 99,014 దరఖాస్తుల పరిశీలన చేయాల్సి ఉందని అన్నారు.
నూతన రేషన్ కార్డ్ ల కోసం వచ్చిన దరఖాస్తుల వెరిపికేషన్ కోసం అవసరమైతే GHMC, రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ కార్డ్ లలో మార్పుల కోసం 99,668 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 38,846 కార్డుల మార్పులు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. ఇంకా 48,498 రేషన్ కార్డ్ ల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. మొత్తం 670 రేషన్ షాప్ లకు గాను 613 షాప్ లు పని చేస్తున్నాయని, వివిధ కారణాలతో రేషన్ డీలర్లు మరణించిన కారణంగా 25 షాప్ లు పని చేయడం లేదన్నారు. మరణించిన డీలర్ల కుటుంబ సభ్యులు ఆసక్తి చూపితే వారికే కేటాయించే వెసులుబాటు ఉన్నందున మరణించిన రేషన్ డీలర్ల కుటుంబ సభ్యులతో సంప్రదించి షాప్ లు వారికే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరో 32 నూతన రేషన్ షాప్ ల ఏర్పాటుకు వెసులుబాటు వెసులుబాటు కల్పించినట్లు కమిషనర్ అనిల్ కుమార్ మంత్రికి వివరించారు. కరోనా నేపథ్యంలో ఒకొక్కరికి 15 కిలోలు చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న 5,80,584 రేషన్ కార్డ్ లకు గాను 33 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో ఇప్పటి వరకు 2.40 లక్షల కార్డ్ దారులకు రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. కొన్ని ప్రాంతాలలో రేషన్ షాప్ లు లబ్దిదారులకు అందుబాటులో లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి అనేక పిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సమస్య తో పాటు సివిల్ సప్లై శాఖలో ఖాళీల భర్తీ, అదనంగా నూతన రేషన్ షాప్ ల ఏర్పాటు వంటి అంశాలను ఈ నెల 14వ తేదీన జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ASO లు కార్యాలయాలకే పరిమితం కాకుండా రేషన్ షాప్ ల తనిఖీ లు నిర్వహించాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా పర్యవేక్షణ జరపాలని అన్నారు. రేషన్ బియ్యం తీసుకొనే లబ్దిదారులు బయోమెట్రిక్ తో కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పిర్యాదులు వస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొనగా, OTP, ఐరిష్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ అనిల్ కుమార్ వివరించారు.