కరోనా రోగులకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను అందించిన కృష్ణా జిల్లా కలెక్టర్
- స్పూర్తి దాయకంగా కాజాస్ హెల్పింగ్ హ్యండ్స్ సేవలు
- సంస్ధ ద్వారా పదిరోజులుగా నిత్యం వందమందికి ఆహారం పంపిణీ
నగరంలోని తాడిగడపకు చెందిన కాజాస్ హెల్పింగ్ హ్యాండ్స్ పౌండేషన్ కరోనా రోగుల కోసం నూతనంగా సమకూర్చిన ఐదు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాజాస్ హెల్పింగ్ హ్యండ్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్పూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. పౌండేషన్ అందిస్తన్న సేవలను సద్వినియోగం చేసుకుని, ఎక్కువ మందికి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ఉపయోగపడేలా రోగులు సైతం సహకరించాలన్నారు.
కాజాస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫోండేషన్ ఛైర్మన్ కాజా చక్రధర్ మాట్లాడుతూ తాము సమకూర్చుకున్న ఐదు కాన్సన్ ట్రేటర్స్ ను రోగులకు ఏడు నుండి పది రోజుల కాలపరిమితితో పూర్తి ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలోనే మరికొన్నింటిని సమకూర్చుకుని కరోనా పీడితులకు పెద్ద ఎత్తున సహకరించాలని భావిస్తున్నామన్నారు.
సంస్ధ కోఛైర్మన్ కాజా రమణి మాట్లాడుతూ తమ సంస్ధ తరుపున గత పది రోజులుగా నిత్యం వంద మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారికి ఇతర రూపాలలో సైతం సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
కార్యక్రమంలో భాగంగా జిల్లా పాలనాధికారి చేతుల మీదుగా నూజివీడుకు చెందిన తిరుపతిరావు, వీరపనేని గూడెంకు చెందిన రాంబాబులకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను అందించారు. కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.