జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలి: అల్లం నారాయణ
హైదరాబాద్: జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 28, 29వ తేదీలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించి వ్యాక్సినేషన్ కేంద్రాలుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యూనాని ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లను జర్నలిస్టులకు ప్రత్యేక కేంద్రాలుగా కేటాయించినట్లు ఆయన తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టుతో పాటు అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులందరూ తమ సంస్థ యొక్క గుర్తింపు కార్డులను వ్యాక్సినేషన్ కేంద్రాలలో నమోదు చేసుకొని టీకాలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్నారని, వారితో పాటు అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులు కూడా టీకాలు తప్పని సరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా, మండలస్థాయిలో కూడా జర్నలిస్టులకు టీకాలు ఇస్తున్నారని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.