అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి: పీసీసీఎఫ్ ఆర్.శోభ
హైదరాబాద్: అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ. అటవీ భూముల రక్షణ, అన్యాక్రాంతమైన అటవీ భూముల స్వాధీనం విధానాలపై అన్ని జిల్లాల అధికారులతో జరిగిన ఆన్ లైన్ సమావేశంలో పీసీసీఎఫ్ పాల్గొన్నారు. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ (దూలపల్లి) నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అన్ని జిల్లాల క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి అటవీ భూముల రక్షణపై అవగాహన కలిగించేలా ఈ ఆన్ లైన్ సమావేశంలో చర్చించారు.
కొన్నిచోట్ల అటవీ నేరాలలో అటవీ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, విచారణ ద్వారా నిజానిజాలు నిగ్గుతేల్చి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆక్రమించిన అటవీ భూములు, వాటిని తిరిగి స్వాధీన పద్దతులపై క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్న చర్యలపై కొందరు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్, ఫారెస్ట్ రేంజ్ అధికారి రామ్మోహన్ తదితర అధికారులు తమ అనుభవాలను వివరించారు. ప్రతీ యేటా వర్షాకాలం ముందు కొత్త వ్యవసాయ సీజన్ లో కొంత మేర అటవీ భూముల ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతాయని క్షేత్ర స్థాయి పెట్రోలింగ్ ద్వారా సమర్థవంతంగా వాటిని నివారించవచ్చన్నారు.
అదే సమయంలో ఆక్రమణలకు గురైన అటవీ భూముల తిరిగి స్వాధీనంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనలు జరగవద్దని పీసీసీఎఫ్ తెలిపారు. పోలీసులు, రెవెన్యూ, స్థానిక ప్రజా ప్రతినిధుల మద్దతుతో కార్యక్రమం జరగాలన్నారు. అడవుల ప్రాధాన్యతను వివరిస్తూ, సమీప గ్రామాలు, గూడేల ప్రజలను చైతన్య వంతం చేయాలని, ఆక్రమణల వల్ల జరిగే నష్టాలను వివరించాలన్నారు.
అటవీ భూ రికార్డులను రెవెన్యూ శాఖతో సమస్వయం చేసుకోవటం, గూగుల్ టైమ్ లైన్ మ్యాపుల ద్వారా మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు తెలిపారు.
స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు, ఆ ప్రాంత ఎమ్మెల్సేలకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అటవీ నేరాల్లో కొన్నిచోట్ల స్వయంగా అటవీ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై విచారణ చేసిన ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో అన్ని జిల్లాల అటవీ అధికారులు, చీఫ్ కన్జర్వేటర్లు, సిబ్బంది 250 మంది పాల్గొన్నారు.