ఒంటేరు ప్రతాపరెడ్డి అధ్యక్షతన ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మూడవ వార్షిక సమావేశం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం, అటవీ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అటవీ అభివృద్ధి సంస్థ (ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ )ను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మూడవ వార్షిక సమావేశం (Annual General Body Meeting) ఈరోజు ఆన్ లైన్ ద్వారా చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది.
యూకలిప్టస్ ను పెంచే సంప్రదాయ పద్ధతుల నుంచి ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా మార్పు చెందాలని, అటవీ అభివృద్ధి సంస్థను ఆ దిశగా తీర్చిదిద్దాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గజ్వేల్ జిల్లా ములుగు సమీపంలో సుమారు 20 ఎకరాల్లో ఒక సెంట్రల్ నర్సరీని ఎఫ్.డీ.సీ తరపున ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు అవసరమైన మొక్కలను సరఫరా చేసే విధంగా ఈ నర్సరీని తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ఎఫ్.డీ.సీ ఉన్న కార్యాలయానికి (అద్దె భవనం) బదులుగా కొత్త ఆఫీస్ కాంప్లెక్స్ ను హైదరాబాద్ కొత్తగూడలో నిర్మించాలని నిర్ణయించినట్లు చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు.
దీనికి ఏకో టూరిజం - ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కాంప్లెక్స్ గా పేరు పెట్టనున్నారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలను మరింత లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్లు/మెంబర్లు అనేక సలహాలు సూచనలు చేశారు. టేట్రా ప్యాక్ లకు అవసరమైన పేపర్ బోర్డ్ మెటీరియల్ తయారు చేయడం, ఐకియా(Ikea) లాంటి సంస్థలకు కలప అందించే అవకాశాలను పరిశీలించటం ఇందులో ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రం నుంచి ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ విభజన ప్రక్రియ పూర్తయిందని దీనికి అనుగుణంగా సెటిల్ మెంట్ లో భాగంగా 51.02 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మొత్తం టర్నోవర్ 150 కోట్లు కాగా, 95.49 కోట్ల లాభాలను ఆర్జించినట్లు వెల్లడించారు. ఇక కరోనా విపత్తు నేపథ్యంలో చనిపోయిన వారి దహన సంస్కారాలు నిర్వహించేందుకు అవసరమైన కలపను సరఫరా చేసేందుకు ఎఫ్.డీ.సీ ముందుకు వచ్చింది. ఇప్పుటి దాకా వివిధ ప్రాంతాల్లో 150 మెట్రిక్ టన్నుల కలపను సరఫరా చేసినట్లు ఎం.డీ వెల్లడించారు.
ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, పీ.సీ.సీ.ఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, మెంబర్లు హేమంత్ కుమార్ IFS, సిద్దానంద్ కుక్రెటీ IFS, జి.ఎస్ రామ్మోహన్ రావు, ఎస్.ఆర్ మోహన్, పవన్ కంకానీ పాల్గొన్నారు.