యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఆసుపత్రి నిర్మాణం: మంత్రి జగదీష్ రెడ్డి

Related image

  • పది రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు
నల్లగొండ: యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక ఆసుపత్రి నిర్మించతలపెట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. పది రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేలా ఏర్పాట్లు జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం వీర్ల పాలెం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను ఆయన మంగళవారం ట్రాన్స్కో &జెన్కో సియండి దేవులపల్లి ప్రభాకర్ రావుతో కలసి సందర్శించారు.

అనంతరం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన బిహెచ్ఇఎల్ అధికారులతో పాటు ట్రాన్స్కో& జెన్కో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడ పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. పనుల్లో జాప్యం జరుగకుండా ఉండేందుకుగాను కార్మికుల్లో ధైర్యాన్ని పెంపొందించేందుకుగాను చేపట్టాల్సిన చర్యలపై మంత్రి జగదీష్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

కోవిడ్ నేపథ్యంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్న ప్రాంగణంలోనే 20 పడకల ప్రత్యేక ఆసుపత్రి నిర్మించాలని నిర్ణయించారు. ఆ ఆసుపత్రి నిర్మాణం 10 రోజుల్లో పూర్తి చేయడంతో పాటు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని ఆయన సూచించారు. తద్వారా కార్మికుల్లో మనోధైర్యాన్ని పెంపొందించడంతో పాటు సిబ్బందికి వైద్య సదుపాయం అందుబాటులో ఉంచగలుగుతామన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో బిహెచ్ఇఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ సిసోడియా, ట్రాన్స్కో డైరెక్టర్లు అజయ్, సచ్చితానంద్, టిఆర్కే రావు కోల్ సియండి జె యస్ రావు, యస్ఇ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.

Yadadri Bhuvanagiri District
G Jagadish Reddy
Telangana

More Press Releases