కోవిడ్ పేషంట్ల పాలిట సంజీవినిగా మారిన టిమ్స్ హాస్పిటల్
హైదరాబాద్: టిమ్స్ లో 1261 బెడ్ లు, 980 బెడ్ లకు ఆక్సిజన్ సౌకర్యం,137 ఐసీయూలు, 266 మంది డాక్టర్లు, 535 మంది వైద్య సిబ్బంది కోవిడ్ రోగులకై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసర్చ్ (టిమ్స్) నిరుపేదల నుండి ఉన్నత వర్గాలకు వరప్రసాదంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుతో గత సంవత్సరం గచ్చిబౌలిలో అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ప్రారంభించిన ఈ 1261 పడకల కోవిడ్ ఆసుపత్రి తెలంగాణ ప్రజానీకానికి సంజీవినిగా మారింది. ఈ 1261 పడకల్లో 980 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఏ ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో లేనివిధంగా ఈ టిమ్స్ లో 137 మెకానికల్ వెంటిలేటర్లతో కూడిన ఐ.సి.యూల సౌకర్యం కూడా ఉంది.
రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రుల మాదిరిగా ఈ 14 అంతస్తుల టిమ్స్ ఆసుపత్రిలో వార్డులు ఉండవు. దీనిలో అన్నీ ప్రత్యేక రూమ్లే ఉంటాయి. ప్రతీ రూమ్ లో కేవలం ఇద్దరు కోవిడ్ పేషేంట్లను మాత్రమే ఉంచి చికిత్స అందిస్తారు. ప్రతీ బెడ్ కు లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యం కూడా ఉంది. ఈ ఆసుపత్రిలో ప్రత్యేకత ఏమంటే, 24 గంటలూ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడమే కాకుండా ప్రతీ రోజూ మూడు, నాలుగుసార్లు పేషంట్ల వద్దకు వచ్చి పరీక్షిస్తారు. డైటీషన్ల సూచించిన ప్రమాణాల మేరకు పేషంట్లకు నిర్ణీత సమయాల్లో ఆహారాన్ని అందిస్తారు. ఆసుపత్రి పరిశుభ్రతకు మరో పేరుగా నీట్ గా ఉంచడంలో ఆసుపత్రి శానిటేషన్ సిబ్బంది కృషి అమోఘం. అయితే, ఆహరం అందించే కాంట్రాక్టర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో ఆ కాంట్రాక్టర్ ను తప్పించి మే మొదటి వారంనుండి కొత్త కాంట్రాక్టర్ ను నియమించడంతో ప్రస్తుతం పేషంట్లకు మంచి ఆహరం కూడా లభిస్తోంది. అయితే, పేషంట్ల ఆరోగ్యం దృష్ట్యా ఇక్కడి పేషంట్ లు బయటినుండి ఆహారం తెచ్చుకోవడాన్ని నిషేదించారు.
మందులు, చికిత్స, డాక్టర్లు, నర్సులు, ఇక్కడి కరోనా పేషంట్ల పట్ల చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను ఇక్కడ చికిత్స పొంది నయం అయిన పేషంట్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా సకాలంలో మందులు అందించడం, ఎంతో ఓపిగ్గా సమస్యలు వినడం, వైద్యులు ఇతర మెడికల్ సిబ్బంది మధ్య మంచి సమన్వయము, మెరుగైన ఆహారం అందించడం వంటి సౌకర్యాలు అందించడం ఇక్కడి పేషంట్లకు మనోధైర్యం కలిగిస్తున్నాయి.
ఈ టిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం 260 మంది డాక్టర్లు, 266 మంది నర్సులతో పాటు పేషంట్ కేర్ సిబ్బంది, తగు సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది, 266 పారా మెడికల్ సిబ్బంది, 130 మంది ఇతర సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా, మరో 190 మంది సిబ్బందిని నియమించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే అనుమతులు జారీ చేసింది.
అయితే, నగరంలో కరోనా పేషంట్లు ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి లక్షలాది రూపాయలు వ్యయం చేసి చివరి సమయంలో టిమ్స్ ఆసుపత్రికి వస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ వారికి మంచి వైద్య సదుపాయాలూ అందచేసి పూర్తిగా నయం చేసి పంపిస్తున్నామని టిమ్స్ ఆసుపత్రి వైద్యులు అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండేకాకా మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా కోవిడ్ పేషంట్లు టిమ్స్ లో జాయినింగ్ కు వస్తున్నారు. ప్రతీ రోజూ కనీసం వంద మంది కోవిడ్ పేషంట్లు టిమ్స్ లో జాయింగ్ కు వస్తున్నారు. ఇంతే సంఖ్యలో కూడా నయం అయి డిస్చార్జ్ అవుతున్నారు. అయితే, ఈ నెల రోజుల నుండి ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స పొంది నయంకాని చివరి నిమిషంలో టిమ్స్ లో చేరిన వారిలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం 650 మందికి పైగా కోవిడ్ పేషంట్లు చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ నగరంలో గాంధీ, కింగ్ కోఠి, నిమ్స్ లతోపాటు పలు ఆసుపత్రుల్లో కోవిడ్ పేషంట్లకు చికిత్స అందిస్తున్నప్పటికీ టిమ్స్ లో చేరేందుకై పెద్ద ఎత్తున రోగులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో లభిస్తున్న మెరుగైన వైద్య సేవలకు నిదర్శనంగా చెప్పవచ్చు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో గత సంవత్సరం ప్రారంభించిన ఈ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసర్చ్ కోవిడ్ పేషంట్లకు వరప్రసాదంగా మారింది.