సంక్షేమ పథకాల రుణ వితరణకు బ్యాంకర్ల సహకారం అత్యావశ్యకం: ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర
- 2,68,832 మంది లబ్ధిదారులకు రూ.3,481 కోట్ల రుణ మంజూరుకు కార్యాచరణ: గంధం చంద్రుడు
2019-2020 ఆర్ధిక సంవత్సరానికిగాను వివిధ కార్పోరేషన్ల పరిధిలో ఇవ్వవలసిన రుణాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశం ఆమోదించింది. ఎస్.సి, ఎస్.టి, కాపు, బిసి, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, ఎంబిసి, వడ్డెర, ఉప్పర, కృష్ణ బలిజ, వాల్మీకి, బట్రాజ, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ, మేదర, ఇబిసి, వైశ్య, కల్లుగీత, దివ్యాంగుల కార్పోరేషన్లకు చెందిన 2,68,832 మందికి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రుణాలు అందించాలని నిర్ణయించారు. మొత్తం లబ్ధిదారులకు రూ.3,481 కోట్లు రుణాలుగా ఇవ్వాలన్న లక్ష్యాన్ని కలిగి ఉండగా, రూ.1740 కోట్లు కార్పోరేషన్ సబ్సిడీగా భరించనుండగా, అయా బ్యాంకులు సుమారు రూ.1,669 కోట్లు తమ వాటాగా భరిస్తాయని ఎస్ఎల్ బిసి ఉపసంఘం కన్వీనర్ గంధం చంద్రుడు తెలిపారు.
సమావేశం అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చంద్రుడు మాట్లాడుతూ ప్రస్తుత అర్ధిక సంవత్సరం రుణ కార్యాచరణ ప్రణాళికతో పాటు గత సంవత్సరం ఇచ్చిన రుణాలు, అయా యూనిట్ల స్ధాపన వంటి అంశాలపై కూడా చర్చించామన్నారు. 30 బ్యాంకుల నుండి ప్రతినిధులు హాజరయ్యారని, బ్యాంకర్ల సహాకారం లేకుండా రుణ వితరణ కార్యక్రమాలు విజయవంతం కాలేవని, ఆక్రమంలో వారి పూర్తి సహకారాన్ని కోరామని పేర్కొన్నారు. బ్యాంకర్ల పక్షాన సమావేశానికి నేతృత్వం వహించిన ఆంధ్రా బ్యాంకు డిజిఎం నాంచారయ్య మాట్లాడుతూ నిర్ధేశించిన లక్ష్యాల మేరకు ముందుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో బిసి కార్పోరేషన్ ఎండి రామారావు, కాపు కార్పోరేషన్ ఎండి హరీంద్ర ప్రసాద్, ట్రైకార్ ఎండి రవీంద్రబాబు తదితరులతో పాటు అయా కార్పోరేషన్ల నిర్వహణా సంచాలకులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.