భారతదేశ స్వాతంత్ర్య పోరాట సంగ్రామంపై ఛాయాచిత్ర ప్రదర్శన
హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న"స్వతంత్ర భారత అమృతోత్సవాలు"లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 1857 నుండి 1950 వరకు జరిగిన భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని వర్ణించే 1500 కి పైగా అరుదైన ఛాయాచిత్రాలతో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని ఉత్సవాల కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారులు డా. కెవి రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
2021, ఏప్రిల్ 9న సాయంత్రం గం. 4:45 ని.లకు హైదరాబాదు మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమయ్యే ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏప్రిల్ 15 వరకు నిర్వహిస్తబడుతుందని, ఈ ఎగ్జిబిషన్ లో 1857 నుండి 1904 వరకు జరిగిన సిపాయిల తిరుగుబాటు, 1905 వందేమాతరం ఉద్యమం నుండి 1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్ ఊచకోత వరకు, 1920 నాటి సహాయ నిరాకరణ ఉద్యమం నుండి 1929 నాటి పూర్ణ స్వరాజ్ ప్రకటన వరకు, 1930 శాసనోల్లంఘన ఉద్యమం (దండి మార్చి ఉప్పు సత్యాగ్రహం) నుండి 1941 వరకు, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం నుండి 1947 భారత స్వాతంత్ర్యం వరకు, 1947 నుండి 1950లో భారత రాజ్యాంగాన్ని స్వీకరించి, స్వయం పాలన ప్రారంభ దశ వరకు అనేక సంఘటనలకు సంబంధించిన ఛాయాచిత్రాలను ప్రదర్శిస్తున్నామని అన్నారు.
పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 7 రోజులపాటు నిర్వహిస్తున్న ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభిస్తారని, విద్యార్థులు, యువత, పోటీ పరీక్షల అభ్యర్థులు, ప్రజలు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించి ఆనాటి భారతదేశ స్వాతంత్ర్య పోరాట సంగ్రామాన్ని దృశ్యరూపంలో చూసే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు.