గతంలో మత్స్య పరిశ్రమ అంటే కేవలం కోస్తాంధ్రకే పరిమితం అన్నట్లుగా ఉండేది: మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: గతంలో మత్స్య పరిశ్రమ అంటే కేవలం కోస్తాంధ్రకే పరిమితం అన్నట్లుగా ఉండేదని, ఆ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్చేసిందని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మత్స్యశాఖ ఆద్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన 117 సంచార చేపల విక్రయ వాహనాలు (మొబైల్ ఫిష్ ఔట్ లెట్ )లను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు శనివారం HMDA గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులుగా ఎంపిక చేయబడిన స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
అదేవిధంగా 13 మహిళా మత్స్యకార సహకార సంఘాలకు 45 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, పార్లమెంట్ సభ్యులు BB పాటిల్, కోత్తా ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, అరికెపుడి గాంధీ, భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ భూక్యా లచ్చిరాం, NFDB ED బోస్కో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒక్కో వాహనం విలువ 10 లక్షల రూపాయలు కాగా 6 లక్షల రూపాయలను ప్రభుత్వం, NFDB లు భరిస్తుండగా, 4 లక్షల రూపాయలను లబ్దిదారులు చెల్లించేలా పథకాన్ని రూపొందించారు.
ఒకవైపు చేపలు, మరో వైపు చేప వంటకాలను విక్రయించుకోనే విధంగా ఈ వాహనాలను డిజైన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చేపలు అంతగా అందుబాటులో ఉండేవి కాదని, ఈ వాహనాల ద్వారా ప్రజల వద్దకే చేపలు, చేపల వంటకాలు వస్తాయని పేర్కొన్నారు. మన చేప మంచినీటి చేప.. దీనికి డిమాండ్ ఎక్కువ అని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలతో చెరువులు అన్ని నింపుతున్నామని, ఎండాకాలంలో కూడా మత్తడీ పోస్తున్నాయని, ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.
మత్స్యకారులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా చేపలు అందజేస్తున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ అంటే అందరికీ బతుకునివ్వడమే అది ఈ రోజు జరుగుతుందని అన్నారు. కులవృత్తులను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రొత్సహిస్తున్నదని అన్నారు. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఇందుకోసం బడ్జెట్ లో 500 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. 1200 కోట్లతో చెక్ డ్యాం లు కడుతున్నామని, అక్కడ కూడా చేపల పెంపకం చేపట్టవచ్చని చెప్పారు.
ఒకప్పుడు మన రాష్ట్రానికి చేపలను దిగుమతి చేసుకోనేవారమని, ఈ రోజు ఇతర ప్రాంతాలకు చేపలను ఎగుమతి చేసుకునే స్థాయికి తెలంగాణ రాష్ట్రం అభివృద్దిని సాధించిందని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి కుటుంబాలలో వెలుగులు నింపాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రాష్ట్రంలోని మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖ కు రూ.10 కోట్ల నిధుల కేటాయింపు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయలకు పెంచారని, ఈ కేటాయింపులే మత్స్య శాఖ అభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనంగా పేర్కొన్నారు. మత్స్యకారుల ఆర్దికాభివృద్ది కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 100 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు.
చేపలకు ప్రజల నుండి పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు నేరుగా అమ్ముకునే వెసలుబాటు కల్పించేలా సంచార చేపల విక్రయ వాహనాలను వాహనాలను మహిళల పేరుతో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులు చేపలు విక్రయించుకొనేందుకు 65 వేల టూ వీలర్స్ ను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. కులవృత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంటే విపక్షాలు మాత్రం గొర్రెలు, చేపల కొసమా తెలంగాణ అంటూ అవహేళన చేశారని ధ్వజమెత్తారు. రాబోయే కాలంలో సంచార చేపల విక్రయ వాహనాల సంఖ్యను 500 వరకు ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఈ రోజు ప్రారంభించిన 117 వాహనాలలో 70 వాహనాలను జిల్లాలకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ వాహనాలు చేతులు మారితే.. వాటిని సీజ్ చేస్తాం అని స్పష్టం చేశారు.