బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు!

Related image

ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ వ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. గత మార్చిలో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్ ను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.

బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి సీనియర్ అధికారులతో కలిసి సోమవారం ప్రగతి భవన్ లో కసరత్తు చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

‘‘దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొని ఉంది. అన్ని రంగాలపై దీని ప్రభావం పడింది. ఆదాయాలు బాగా తగ్గిపోయాయి. అన్ని రాష్ట్రాల్లో ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయం-అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలి. వాస్తవ దృక్పథంతో బడ్జెట్ తయారు చేయాలి. ప్రజా సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులుండేలా చూడాలి’’ అని చెప్పారు.

బడ్జెట్ రూపకల్పనపై మంగళవారం కూడా కసరత్తు జరుగుతుంది. తుది రూపం వచ్చిన తర్వాత మంత్రివర్గ ఆమోదం తీసుకోవడం, అసెంబ్లీని సమావేశపరిచి, బడ్జెట్ ప్రతిపాదించడం తదితర ప్రక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

KCR
budget
Telangana

More Press Releases