రేపు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్!

Related image

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులను ఆహ్వానించారు. కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అవినీతికి ఆస్కారంలేని, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చట్టం ఉండాలంటే ఎలాంటి నిబంధనలు రూపొందించాలనే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

క్షేత్రస్థాయిలో తమ అనుభవంలో ఉన్న విషయాలను, కొత్త చట్టం రూపకల్పనలో సూచనలను కలెక్టర్లందరి నుండి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం కలెక్టర్లు కూడా అభిప్రాయాలు, సూచనలు ఇవ్వడానికి, చర్చలో భాగస్వామ్యం కావడానికి సిద్ధమై రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. పల్లెలు, పట్టణాలలో అమలు చేయబోయే 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చిస్తారు. మూడు విషయాలపై లోతైన చర్చ జరగాల్సి ఉన్నందున సమావేశం రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

More Press Releases