రోగుల పట్ల సానుకూల ధోరణి అలవరుచుకోండి: ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్

Related image

  • విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ హరిచందన్
  • ఆసుపత్రి సేవలపై రోగులతో ముఖాముఖి

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాల పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు బాగున్నాయని, రోగులు తమకు అందుతున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ శుక్రవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. గవర్నర్‌ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాంచారయ్య తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతించారు.

 ఈ సందర్భంగా బిశ్వ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ పరిశుభ్రత పరంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని చక్కగా నిర్వహిస్తున్నారని, రోగుల శ్రేయస్సు కోసం ఆసుపత్రులలో శుభ్రత, పచ్చదనం చాలా అవసరమని చెప్పారు. పేదలకు అన్ని వేళలా రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని, రక్తదానాన్ని ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అదేశించారు. తొలుత గవర్నర్ ఆసుపత్రి ప్రాంగణాన్ని సందర్శించి రోగులు, వైద్యులతో సంభాషించారు.

అనస్థీషియాలజీ, జనరల్ సర్జరీ, పాథాలజీ, రేడియాలజీ, బ్లడ్ బ్యాంక్ విభాగాలను సందర్శించిన గవర్నర్ అక్కడ అందుతున్న వైద్య సౌకర్యాలపై అరా తీశారు. ఆసుపత్రిలో అందించే సౌకర్యాలు, సేవలతో రోగులు సంతృప్తి చెందుతున్నారా లేదా అన్న విషయంపై గవర్నర్ ప్రత్యేక శ్రధ్ధ చూపారు. డాక్టర్ శివ శంకర్, డాక్టర్ సైలా బాలా, డాక్టర్ లంకేశ్వరి తదితరులతో మాట్లాడిన బిశ్వ భూషణ్ పేద రోగుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించాలన్నారు. హరిచందన్ తో పాటు గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌ కుమార్ మీనా, రాజ్ భవన్ జాయింట్ సెక్రటరీ అర్జున రావు, ఇతర అధికారులు ఉన్నారు.

More Press Releases