పర్యావరణహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుంటున్నాం, అందరి సహకారం అవసరం: మంత్రి హరీష్ రావు
- భవిష్యత్ తరాల కోసం అడవులు కాపాడాలి, పచ్చదనం పెంచాలి
- మెదక్ జిల్లా పోచారంలో నిర్మించిన పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
అడవి, జంతువులు, పర్యావరణం ప్రాధాన్యత తెలిపేలా నమూనాలు (Exhibits), సందర్శకుల వసతులను ఇక్కడ అటవీ శాఖ ఏర్పాటు చేసింది. దీని వలన ఉమ్మడి మెదక్, చుట్టు పక్కన జిల్లాలతో పాటు, రాష్ట్ర ప్రజలకు ప్రకృతి వన్య జీవుల పట్ల అవగాహణ కల్పించేలా నిర్మాణం జరిగింది. ముఖ్యంగా స్కూలు పిల్లలకు పర్యావరణం, పచ్చదనం పెంపుపై స్ఫూర్తి కలిగించేలా ఈ సెంటర్ ను తీర్చిదిద్దారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పర్యావరణ హితమైన సమతుల్య అభివృద్ధిపై దృష్టి పెట్టాం, అభివృద్ధి, సంక్షేమంతో పాటు అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా తెలంగాణను మలుచుకునే పనిలో ఉన్నాం. అందులో భాగంగానే తెలంగాణకు హరితహారంలో భాగంగా జంగల్ బచావో, జంగల్ బడావోలో నినాదం తీసుకున్నాం..ఉన్న అడవిని కాపాడుకోవటం, కొత్తగా పచ్చదనం పెంచుకోవటం మనందరి కర్తవ్యం కావాలి అని అన్నారు. పర్యావరణం, అడవులు ఉంటేనే మనకు పీల్చేగాలి స్వచ్చంగా దొరుకుతుంది. లేదంటే ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నట్లే రానున్న రోజుల్లో ఆక్సీజన్ ను కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విడతల్లో సుమారు 210 కోట్ల మొక్కలు నాటాం. అందరం వాటిని రక్షించేందుకు, పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు.
పీసీసీఎఫ్ ఆర్ శోభ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు గర్వకారణమైన పోచారం అభయారణ్యం మరింతగా వృద్ధి చెందే దిశగా పర్యావరణ కేంద్రంతో పాటు, సందర్శకులు అడవిలో తిరిగి చూసేందుకు సఫారీ వాహన సౌకర్యం కల్పిస్తున్నాం. ఇక అరుదైన మూజిక జింకలను (మౌజ్ డీర్) లను కూడా అడవిలోకి విడుదల చేశామని తెలిపారు.
కార్యక్రమంలో శేరి సుభాశ్ రెడ్డి, శాసన మండలి సభ్యులు, పద్మా దేవెందర్ రెడ్డి, శాసన సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు, చీఫ్ కన్జర్వేటర్ సి.శరవనణ్, ఎ. మనోజ్ కుమార్, అటవీ క్షేత్రాధికారి, యస్.శ్రవణ్ కుమార్, అటవీ సెక్షన్ అధికారి, పోచారం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.