ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో కలపటం సరికాదు: కేంద్ర ప్రభుత్వానికి యార్లగడ్డ వినతి
- కేంద్ర ప్రభుత్వానికి ఏపీ రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విజ్ఞప్తి
భారత ప్రభుత్వం ప్రాచీన భాషల అభ్యున్నతికికోసం తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా ప్రకటించి అమలు చేస్తోంది. సంస్కృతం, తమిళ భాషలకు స్వయం పతిపత్తిని ఇవ్వడమైంది. ఢిల్లీలో సంస్కృతం, చెన్నైలో తమిళ సంస్థలు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్నాయి. తెలుగు, కన్నడ, ఒడియా భాషా కేంద్రాలు మాత్రం భారతీయ భాషా సంస్థలో భాగంగానే ఉన్నాయి. మైసూరులో కన్నడ కేంద్రం, నెల్లూరులో తెలుగు కేంద్రం, భువనేశ్వర్ లో ఒడియా కేంద్రం, కేరళలోని మలయాళ విశ్వవిద్యాలయం లో మలయాళ కేంద్రం పనిచేస్తున్నాయి.
నెల్లూరులోని ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో కలపడం వల్ల తెలుగు కేంద్రం స్వయం పతిపత్తి కోల్పోవడమే కాకుండా అభివృద్ది కుంటుపడుతుంది. దీనికి కేటాయించవలసిన నిధులు కూడా విశ్వవిద్యాలయ పరిధిలోకి వెళ్ళి కుదించుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలు చాలా పనిచేస్తున్నాయి. అదే విధంగా హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలోను, అనంతపురం లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనూ తెలుగు శాఖలు ఉన్నాయి. వీటన్నింటిలోను బోధన ప్రధానంగాను, పరిశోధన పరిమితంగానూ జరుగుతున్నాయి. ఆయా విశ్వవిద్యాలయాల్లో ఎం.ఫిల్., పి.హెచ్.డి. డిగ్రీల కోసం విద్యార్థులు చేసే పరిశోధనలకే పరిమితం అవుతున్నాయి. వాటిల్లో ప్రచురణ అంతంత మాత్రంగానే జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో కలపడంవలన తీవ్రమైన నష్టం కలుగుతుంది. రెండేళ్ళ క్రితం ఏర్పడిన ఈ కేంద్రంలో ఏడు బాహ్య ప్రాజెక్టులు పూర్తి అయినాయి. అందులో ఒకటి ముద్రితమైంది. మిగిలిన ఆరు ముద్రణ చేపట్టవలసి ఉంది. అంతర్గత ప్రాజెక్టులు ఏడు పూర్తి అయినాయి. వాటిని కూడా త్వరలో ముద్రించవలసి ఉంది. మరో నాలుగు బాహ్య ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి.
ప్రాచీన తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రం తన లక్ష్యాలకు అణుగుణంగా శాసనాలు చదవడం, తాళపత్రాలు పరిష్కరించడం, తెలుగు సాహిత్య అధ్యయనం గురించి కార్యశాలలను, శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. పురవస్తు సంగ్రహాలయాన్ని ఏర్పాటు చెయ్యడానికి వస్తు సామగ్రిని సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో చేయనటువంటి, కనుమరుగైపోతున్న కళాకారులను, సాహిత్యకారులను, జానపద గిరిజన కళాకారులను, జానపద కళారూపాలను, చరిత్ర సంస్కృతలను దృశ్యీకరణ (డాక్యుంటేషన్), అంతర్జాలీకరణ (డిజిటలలైజేషన్) చేయించి రాబోయే తరాల వారికి అందించటం, గ్రామీణ చేతివృత్తుల భాష, వస్తు సామగ్రిని సేకరించి భద్రపరచడానికి ప్రాచీన తెలుగు కేంద్రంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ కేంద్రం లక్ష్యాలను విశ్వవిద్యాలయం ద్వారా సాధించడం అచరణ సాధ్యం కాదు. కాబట్టి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని స్వయం ప్రతిపత్తి కేంద్రంగానే ఉంచాలని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరుతున్నారు.
ముఖ్యంగా ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిన తరువాత కేంద్ర ప్రభుత్వం 2008లో తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చి ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రాన్ని మైసూరులో ఏర్పాటు చేసింది.
ఉపరాష్ట్రపతి గౌరవనీయులు ఎం.వెంకయ్యనాయుడు గారి చొరవతో, ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి గారి ప్రయత్నాల వలన ఆ కేంద్రం మైసూరు నుండి మనరాష్ట్రంలోని నెల్లూరుకు తరలించబడింది. నెల్లూరు కేంద్రంగా ఎంతో వేగంగా పరిశోధనలు నిర్వహిస్తున్న ఈ నెల్లూరు కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి గారు అయిదు ఎకరాల రాష్ట్రప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రాన్ని మరలా మైసూరులో నెలకొల్పే భారతీయభాషల విశ్వవిద్యాలయంలో కలపడం ఆత్మహత్యా సదృశ్యమని, అందుచేత నెల్లూరు లోని ఈ కేంద్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించి నెల్లూరులోనే కొనసాగించాలని యార్లగడ్డ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.