ఆప్కో ఛైర్మన్ గా చిల్లపల్లి వెంకట నాగమోహన రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహాకార సంఘం (ఆప్కో) ఛైర్మన్ గా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన చిల్లపల్లి వెంకట నాగమోహన రావు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి జె.మురళి ఈ మేరకు జిఓ నెంబర్ 252 జారీ చేశారు.
ఆరు నెలల పాటు చిల్లపల్లి పదవిలో కొనసాగనుండగా, ఈ లోపు చేనేత సహకార సంస్ధలకు ఎన్నికలు నిర్వహిస్తే తదనుగుణంగా వ్యవహరించవలసి ఉంటుందని ఆ ఉత్తర్వులలో పేర్కోన్నారు. చేనేత కార్మికుల స్వావలంబన కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న చిల్లపల్లి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు.
చేనేత కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలన్న ధ్యేయంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆప్కో ఛైర్మన్ గా చిల్లపల్లికి అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో నాగమోహన రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా చేనేత వ్యవస్ధను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తానన్నారు. నూతనత్వం, నాణ్యతలను మరింతగా పెంపొందించటం ద్వారా విక్రయాలను పెంపొందించాలన్నది తన ఆలోచన అన్నారు.
కార్మికులకు మూడుపూటలా పని, మూడు పూటలా ఆహారం అందించగలగాలన్నదే తన ఆకాంక్ష అని చిల్లపల్లి పేర్కోన్నారు. రెండు విడతలుగా నేతన్న నేస్తం ఇచ్చి చేనేత కార్మికులను సీఎం ఆదుకున్నారని, ఇందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క చేనేత కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. నూతన ఛైర్మన్ గా చిల్లపల్లి వెంకట నాగమోహనరావు ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.