రాజ్ భవన్ లో ఘనంగా రాఖీ పౌర్ణిమ వేడుకలు!
- గవర్నర్ కు రక్షబంధన్ శుభాకాంక్షలు అందించిన బాలికలు
ఏపీలోని రాజ్ భవన్ లో రక్షాబంధన్ వేడుకలు వైభవంగా జరిగాయి. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు వివిధ విద్యాసంస్ధల నుండి వచ్చిన విద్యార్ధులు రాఖీలు కట్టి అశీస్సులు తీసుకున్నారు. తొలుత గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ ఉద్యోగులు, అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది గవర్నర్ ను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ నేపధ్యంలో గవర్నర్ నాటి పోరాటాలను గుర్తు చేసుకున్నారు.
అనంతరం పటమట లంక కెఎస్ఆర్ జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్ధులు దాదాపు వంద మంది ఇక్కడి దర్బార్ హాలులో గవర్నర్ ను కలిసి రాఖీలు కట్టి పుష్పగుచ్చాలు అందించారు. తక్షశిల ఐఎఎస్ అకాడమీ విధ్యార్ధులు పలువురు గవర్నర్ నుండి శుభాశీస్సులు అందుకున్నారు. అకాడమీ డైరెక్టర్లు డాక్టర్ బిఎస్ఎన్ దుర్గా ప్రసాద్, డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు సివిల్స్ సాధన కోసం విజయవాడ కేంద్రంగా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను వివరించారు. బ్రహ్మకుమారీ సంస్ధ నుండి తరలివచ్చిన పలువురు మహిళలు గవర్నర్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు అందచేసారు. ఈ కార్యక్రమాలలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు, ఎడిసి మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.