మిషన్ భగీరథ నీటి కంటే స్వచ్చమైన తాగునీరు ఇంకెక్కడా దొరకదు: స్మితా సభర్వాల్

Related image

హైదరాబాద్: మిషన్ భగీరథ నీటిని మాత్రమే తాగేలా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలను మరిన్ని రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్. భగీరథ కంటే స్వచ్చమైన తాగునీరు ఇంకెక్కడా దొరకదన్నారు. ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సిఈ, ఎస్.ఈలతో సమీక్షా సమావేశం నిర్వహించిన స్మితా సభర్వాల్, కొత్తగా నిర్మిస్తున్న రైతు వేదికలు, వైకుంఠదామాలకు భగీరథ నీటిని అందించాలన్నారు.

అంగన్ వాడీలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్యసంస్థలతో పాటు ధార్మిక సంస్థలకు కూడా భగీరథ వాటర్ కనెక్షన్ ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భగీరథ వాటర్ బాటిల్స్ ను ఉపయోగించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముందుగా రోజువారీ తాగునీటి సరాఫరా తీరును ఈఎన్.సి కృపాకర్ రెడ్డి సిఎంఓ కార్యదర్శికి వివరించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథతో శుద్దిచేసిన తాగునీరు అందుతోందని, అనుకున్న పరిమాణం కంటే ఎక్కువగానే నీటిని సరాఫరా చేస్తున్నామని చెప్పారు.

సరాఫరాతో పాటు నీటి నాణ్యతపై దృష్టి పెట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న స్టెబిలైజేషన్ కార్యక్రమాల్లో ఇంటింటికి సరాఫరా అవుతున్న నీటి నాణ్యతను కూడా పరీక్షిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ నిపుణులతో ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన స్మితా సభర్వాల్ వందకు వంద శాతం స్టెబిలైజేషన్ ను సాధించిన అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.

ఈ నెల చివరి నాటికి మారుమూల ఆవాసాలు ( ఐసోలేటెడ్ ) అన్నింటికి భగీరథ నీటిని అందించాలన్నారు. జనవరిలో నిర్వహించే సమీక్షా సమావేశం నాటికి రాష్ట్రంలోని అన్ని ఐసోలేటెడ్ ఆవాసాలకు భగీరథ నీరు సరాఫరా కావాలన్నారు. ఇక భగీరథలో భాగంగా నిర్మించిన సివిల్ కట్టడాలు, పంపుసెట్లు, పైప్ లైన్ ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్ తో పాటు చీఫ్ ఇంజనీర్లు, ఎస్.ఈలు పాల్గొన్నారు.

Mission Bhagiratha
Smitha Sabharwal
Hyderabad
Telangana

More Press Releases