ఈజీఎంఎం ద్వారా ఉపాధి శిక్షణ, ఉద్యోగావకాశాలు: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
- శిక్షణా సంస్థలు, అధికారులతో సమీక్షించిన పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలోని ప్రతి ఇంటికి కనీసం ఒక ఉపాధి లేదా ఉద్యోగ అవకాశం కల్పించి బంగారు తెలంగాణకై సిఎం కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఈ డి.డి.యు.జీ.కే.వై (DDUGKY) ప్రోగ్రాం 2016 - 19 ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన 47 వేల 311 టార్గెట్ కు, 51 వేల 611 గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి 36 వేల 688 ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగిందన్నారు. 2019 - 22 ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం 90 వేల మంది యువతకి శిక్షణ ఇచ్చి కనీసం 63 వేల మందికి ఉద్యోగ కల్పనకై ప్రణాళికలు రూపొందించారన్నారు. ఇందుకు 57 ప్రయివేట్ సంస్థలను భాగస్వాములుగా చేస్తూ, 824 కోట్ల రూపాయల బుడ్జెట్ ను నిర్ధారించామన్నారు.
అయితే కోవిడ్-19 ప్రభావం వలన ఈకార్యక్రమాన్ని అనుకున్న స్థాయిలో అమలు చేయలేకపోతున్నారని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాల కోవిడ్-19 నియమ నిబంధనలను, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ శిక్షణ సంస్థలు శిక్షణ కొనసాగించాలని మంత్రి కోరారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సూచించారు.
ఉపాధి, ఉద్యోగాల కల్పనతోనే ఆగిపోకుండా, వారికి కనీసం ఏడాదిపాటు తగు సహకారం అందిస్తే, ఆయా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వారు స్థిర పడతారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇజిఎంఎం ఈడీ గణేశ్, సంబంధిత సంస్థల అధికారులు, బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.