వరదల్లో మరణించిన వారి కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేసిన హోం మంత్రి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు శనివారం నాడు చెక్కులు పంపిణీ చేశారు. పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంలో హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమస్య శాశ్వత పరష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. భారీ వర్షాలతో దాదాపు 12 మంది పాత బస్తిలోని వరదల్లో చనిపోయారన్నారు. చనిపోయిన వారి ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెక్కును పంపిణీ చేశారు.
బహదూర్ పురకు చెందిన అనాస్ బేగం, ఫరా బేగం మరియు కనిజ్ బేగం కుటుంబ సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. కొంతమంది మరణించిన వారి కుటుంబసభ్యులు హాజరు కాలేకపోయారు. వారి చెక్కులు MRO కి అప్పగించారు. అక్టోబర్ 13 మరియు 14వ తేదిలలోని వర్షాలలో తమ ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని హోం మంత్రి గుర్తు చేశారు.