విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారు: సీఎం కేసీఆర్

Related image

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాటి వల్ల పోటెత్తుతున్న వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండి, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు జెన్ కో – ట్రాన్స్ కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇవాళ సీఎండి ప్రభాకర్ రావుతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఆదేశించారు. 

‘‘చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగింది. విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారు. వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు ఇదే స్ఫూర్తి కొనసాగించండి’’ అని ముఖ్యమంత్రి సీఎండిని ఆదేశించారు.

‘‘రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వరదల్లో పెద్ద సంఖ్యలో ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. పోళ్ళు వరిగిపోయాయి. వైర్లు తెగిపోయాయి. ఇంకా వానలు, వరదల ఉధృతి తగ్గలేదు. జలమయమయిన ప్రాంతాలకు సిబ్బంది వెళ్లడం కూడా సాధ్యం కావడం లేదు. హైదరాబాద్ తో పాటు చాలా పట్టణాల్లో అపార్టుమెంట్లు నీటితో నిండి ఉండడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం అనివార్యం అయింది. కొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేయడం జరిగింది. పరిస్థితిని బట్టి మళ్లీ సరఫరా చేస్తున్నాం. ఎక్కడి వరకు సిబ్బంది చేరుకోగలుగుతున్నారో అక్కడి వరకు వెళ్లి 24 గంటల పాటు పునరుద్ధరణ పనులు చేయడం జరుగుతున్నది’’ అని సిఎండి వివరించారు.

KCR
Telangana

More Press Releases