బాలలపై లైంగిక నేరాలను ఉపేక్షించబోము: కృతికా శుక్లా
- బాలలపై లైంగిక నేరాలను ఉపేక్షించబోము: ఫోక్సో నిబంధనలు 2020 శిక్షణా కార్యక్రమంలో డాక్టర్ కృతికా శుక్లా
ఈ ఆన్-లైన్ శిక్షణా కార్యక్రమంలో పోక్సో చట్టం అమలులో భాగస్వాములైన చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, పొలిసు అధికారులు, స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్లు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, జిల్లా ప్రొబేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ పోక్సో చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని, అన్ని జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయగా, రాష్ట్రంలోనే ప్రప్రధమంగా గుంటూరులో బాలలతో స్నేహ పూర్వక (చైల్డ్ ఫ్రెండ్లీ) కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరోవైపు దిశ చట్టం క్రింద ఏర్పాటు చేయబడిన ప్రత్యేక పొలిసు స్టేషన్లు పోక్సో చట్టం అమలు కోసం కూడా పని చేస్తున్నాయన్నారు.
నూతన పోక్సో నిబంధనల ప్రత్యేకతల గురించి వివరిస్తూ ఇకపై పిల్లలతో కలిసి పనిచేసే, వారికి వసతి కల్పించే సంస్ధలు, పాఠశాలలు, క్రెష్ సెంటర్లు, క్రీడా అకాడమీల సిబ్బంది గత చరిత్రపై పొలిసు నివేదిక తప్పనిసరన్నారు. పిల్లలతో నీలి చిత్రాలు తీయడాన్ని అరికట్టే క్రమంలో అందుకు సంబంధించిన ఏ సమాచారం అయినా స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ (SJPU) గాని, పోలీసులకు గాని, సైబర్ క్రైమ్ పోర్టల్ కు గాని రిపోర్ట్ చేయాలన్నారు.
పిల్లలపై హింసకు అవకాశమివ్వని విధంగా చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీలను రూపొందించుకోవాలని నూతన నిబంధనలు చెబుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదిశగా ఇప్పటికే చర్యలు చేపట్టిందని వివరించారు. పిల్లలతో పని చేసే సంస్థలకు, వ్యక్తులకు నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పిల్లలు వారి భౌతిక, వాస్తవిక గుర్తింపును, భావోద్వేగ, మానసిక స్థితిని కాపాడుకునలా, తమను తాము లైంగిక నేరాల నుండి రక్షించుకునేలా, వాటి గురించి పిర్యాధు చేసే వ్యవస్థల గురించి తెలుసుకునేలా, వారి వయసుకు తగినట్లుగా ప్రభుత్వాలు పాఠ్యాంశాలలో జోడించి బోధించాలని నూతన నిబంధనలు స్పష్టం చేసాయన్నారు.
లైంగిక నేరాల నుండి బాధించబడ్డ పిల్లలకు అందాల్సిన హక్కుల గురించి వివరిస్తూ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవటం, పొలిసు ద్వారా తగినంత రక్షణ పొందటం, ప్రభుత్వ ఆసుపత్రులలో తక్షణ, ఉచిత వైద్య పరీక్షలు, మానసిక ఆరోగ్యం కొరకు కౌన్సలింగ్, కన్సల్టేషన్ లను పొందడం, పిల్లలకు అనుకూలమైన స్ధలంలో వారి స్టేమెంట్ రికార్డు చేయడం, నేరాలు జరిగిన సందర్భాల్లో పిల్లలకు నమ్మకమున్న వ్యక్తి సంరక్షణలో ఉండడం కీలకమైనవని కృతికా శుక్లా పేర్కొన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి సిఫార్సు మేరకు తక్షణ సహాయం, సహకారం అందుకోవడం.
అన్ని సందర్భాల్లోనూ నేరస్తుడికి దూరంగా ఉండటం, అవసరమైన చోట అనువాదకున్ని పొందటం, వికలాంగ పిల్లల విషయంలో నిపుణులను సహకారం తీసుకోవటం, ఉచిత న్యాయ సహాయాన్ని పొందటం, తన వివరాలను బహిర్గతపరచకుండా గోప్యంగా ఉంచడం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా సహాయకుడి (సపోర్ట్ పర్సన్) ని పొందటం, చదువు కొనసాగించడం, జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, ఇతర ముఖ్యమైన అధికారుల ఫోన్ నంబర్లను పొందడం కూడా పిల్లల హక్కులలో భాగమే నన్నారు. యూనిసెఫ్ వారి భాగస్వామ్యంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనురాధ, సిఐడి ఎఐజి సునీల్ కుమార్, సయూనిసెఫ్ చైల్డ్ స్పెషలిస్ట్ సోని కుట్టి జార్జ్ , సుప్రీమ్ కోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ అనంత్ కే. ఆస్తానా తదితరులు అధికారులకు శిక్షణ ఇచ్చారు.