కేంద్రం నుంచి రావాల్సిన వెయ్యి కోట్ల నిధులు వెంటనే ఇవ్వాలి.. తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానం!
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన వెయ్యి కోట్ల నిధులను వెంటనే ఇవ్వాలని, అలాగే, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానించింది. 5వ తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్ లోని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దేశంలో ఉపాధి హామీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పని దినాలను, నిరుపేదలకు ఉపాధిని కల్పించలిగామన్నారు. ప్రత్యేకించి కరోనా వైరస్ విస్తరణ, లాక్ డౌన్ సమయంలో కేవలం 15 రోజుల్లోనే 25లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇది జాతీయ రికార్డు అన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా ఉపాధి కల్పనతో పాటు, నిరుపేదల ఆర్థిక స్థాయిని కూడా పెంచగలిగామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 29.23 కుటుంబాలకు ఉపాధిని కల్పించామని, ఇది దేశంలోనే రికార్డు అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఏడాది 3వేల కోట్ల రూపాయల పనులు రాష్ట్రంలో జరిగాయన్నారు. గతంలో ఉపాధి హామీ పనులంటే అంతగా అభివృద్ధి కనిపించేది కాదన్నారు. కానీ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో సీఎం కెసిఆర్ దిశా నిర్దేశంతో పలు అభివృద్ధి పనులకు ఉపాధి హామీని అనుసంధానించామని మంత్రి తెలిపారు. నర్సరీలు, మొక్కల పెంపకం, చెరువుల పూడికతీత, ఇంకుడు గుంతలు, సిసి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠ దామాలు, ప్రకృతి వనాలు, డంపు యార్డులు, కల్లాలు, రైతు వేదికలు వంటివెన్నో నిర్మిస్తున్నామని చెప్పారు.
ఇంకుడుగుంతల్లోనూ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. నిర్ణీత కాలానికి ముందే ఉపాధి హామీ పనులన్నీ పూర్తి చేసి, కొత్తగా మరిన్ని నిధుల కోసం నిధులను కేంద్రాన్ని అడిగిన రాష్ట్రం కూడా మనదేనన్నారు. ఇన్ని విధాలుగా దేశంలో నెంబర్ వన్ గా నిలిచేందుకు కృషి చేసిన సిఎం కెసిఆర్ కి మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కింది స్థాయిలో ప్రజా ప్రతినిధులు ప్రత్యేకించి సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులను మంత్రి అభినందించారు. అలాగే నిర్ణీత లక్ష్యాలకనుగుణంగా పని చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఉపాధి హామీ అధికారులు అందరినీ మంత్రి అభినందించారు. అలాగే రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా పని చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, కమిట్ మెంట్ తో పని జరుగుతున్నది. గ్రామాల్లో పచ్చదనం పరుచుకుంటున్నది. సీజనల్ వ్యాధులు తగ్గాయి. గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా ప్రతి నెలా రూ.308 కోట్లు విడుదల చేస్తుండటంతో పనులు జరుగుతున్నాయి. పల్లెప్రకృతి వనాలు అద్భుతంగా ఉన్నాయి. సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణమవుతున్నాయి. మా ఆదిలాబాద్ జిల్లాకు మరిన్ని నిధులు అందేలా చూడండి...అని అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, స్వచ్ఛ అవార్డులు తీసుకుంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వారి టీమ్ కి అభినందనలు. ఉపాధి హామీ పనులు అద్భుతంగా సాగుతున్నాయి. గ్రామాల రూపురేఖలు మారాయి. సమర్థవంతంగా పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ నుంచి గిరిజన సంక్షేమానికి రావాల్సిన నిధులను క్రమం తప్పకుండా అందించాలి. ఇంకా 12వేల అంగన్ వాడీలకు సొంత భవనాలు లేవు. కిరాయిలు కోట్ల రూపాయలు కడుతున్నాం. ఇందుకు బదులుగా ఉపాధి హామీ పథకం కింద అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణానికి కృషి చేయండి. రెండు మూడేండ్లు నిధులు కేటాయిస్తే, భవనాలు పూర్తవుతాయి. అని చెప్పారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన ఉపాధి హామీని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న మంత్రి ఎర్రబెల్లి గారికి, సంబంధిత శాఖ టీమ్ కి అభినందనలు తెలుపుతున్నాను. వ్యవసాయ రంగానికి కూడా ఉపాధి హామీని అనుసంధానించే పనిని పూర్తి చేయండి. తద్వారా ఇంకా ఈ పథకం ప్రజలకు మరింత చేరువ అవుతుంది. అభివృద్ధీ జరుగుతుంది. అని తెలిపారు.
ఈ సమావేశంలో రెండు తీర్మానాలను చేసింది. రాష్ట్రానికి రావాల్సిన రూ.వెయ్యి కోట్ల ఉపాధి నిధిని వెంటనే కేంద్రం ఇవ్వాలని, అలాగే, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులను అనుసంధానించాలని మంత్రి ఎర్రబెల్లి తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, గిరిజన సంక్షేమ కమిషన్ క్రిష్టినా, ఉపాధి హామీశాఖ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కౌన్సిల్ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉపాధి హామీ పథకం పనితీరుని అధికారులు మంత్రులకు వివరించారు.*ప్రజల ఆస్తులకు హక్కు,
భద్రత కల్పించేందుకే నిర్మాణాల నమోదు:
- గ్రామ పంచాయతీల్లో నిర్మాణాల నమోదు పై అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఇఓలు, డిపిఓలతో వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు
ఈ నెల 10వ తేదీలోగా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని నిర్మాణాల నమోదు పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో నిర్మాణాల నమోదు పై అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఇఓలు, డిపిఓలతో వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ని హైదరాబాద్ లోని తన కార్యాలయం నుంచి గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ధరణి పోర్టల్ దసరా సందర్భంగా ప్రారంభవుతుందని సీఎం కెసిఆర్ చెప్పారని, ఆలోగానే ప్రతి గ్రామంలోని నిర్మాణాలు, కుటుంబాల వివరాలన్నీ తప్పులకు తావులేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని చెప్పారు. ఇంటి యజమానుల నుండి ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. ఒకవేళ యజమాని గనుక చనిపోతే.. ఎలాంటి వివాదాలకు తావులేకుండా అతని వారసుల పేరుమీద మ్యూటేషన్ చేయాలి. వ్యవసాయ భూములలో నిర్మించిన అన్ని ఆస్తులను కూడా నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఇందు కోసం ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తేవడం జరుగుతోందన్నారు. అధికారులందరూ వారి పరిధిలోని ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలి. సర్పంచులు, మండల పరిషత్తు అధ్యక్షులకు వేరే ఎన్ని పనులున్నప్పటికి దీనిని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని గ్రామాల్లో అన్ని ఆస్తుల వివరాలు నమోదు అయ్యేట్టు చూడాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. ఈ సందర్భంగ మంత్రి పలువురు అధికారులతోపాటు, సర్పంచ్ లతోనూ మాట్లాడారు. రికార్డుల నమోదులో స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ పనులు చేయాలని, ఎవైనా అనుమానాలుంటే, రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.