సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం: మంత్రి తలసాని
దేశంలో ఎక్కడా లేనివిధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం సికింద్రాబాద్ RDO కార్యాలయంలో 157 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. పేదింటి ఆడపడుచుల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద లక్ష 1116 రూపాయల ఆర్ధిక సహాయం అందించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఆసరా పెన్సన్ లు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల సౌకర్యాలను కల్పించి కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా పేదప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానా లను కూడా ప్రారంభించినట్లు వివరించారు.
ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, కుర్మ హేమలత, RDO వసంత కుమారి, తహసిల్దార్ బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు.