స్వచ్ఛ భారత్ లో తెలంగాణ హ్యాట్రిక్.. దేశంలో మరోసారి నెంబర్ వన్ గా తెలంగాణ
- వరసగా ఇది మూడో మొదటి బహుమతి
- జిల్లాల కేటగిరీలో కరీంనగర్ కు మూడో స్థానం
- సిఎం కెసిఆర్ రూపొందించిన పట్టణ-పల్లె ప్రగతి, మిషన్ భగీరథ కార్యక్రమాల ఫలితం
- అవార్డులు సాధించినందుకు ఆనందంగా ఉంది
- ఈ వార్డులు రావడానికి కారణమైన సీఎం కెసిఆర్, కెటిఆర్ లకు కృతజ్ఞతలు
- అవార్డులు ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు
- అవార్డులు పొందిన వాళ్ళందరికీ అభినందనలు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రతి ఏటా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్ లు, గ్రామ పంచాయతీల వారీగా అవార్డులు అందచేస్తున్నది. తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో గత ఏడాది మూడు ప్రచారాలను కేంద్రం ప్రారంభించింది. అందులో 2019, నవంబర్ 1 నుంచి 2020, ఏప్రిల్ 20 “స్వచ్ఛ సుందర్ సముదాయిక్ షౌచాలయ (ఎస్ఎస్ఎస్ఎస్)” కార్యక్రమాన్ని, జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు జిల్లాలు మరియు గ్రామాలను సమీకరించి వారి కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం-నిర్వహణకు. “ సముదాయిక్ షౌచలయ అభియాన్ (ఎస్ఎస్ఎ) కార్యక్రమాన్ని, 2020 ఆగస్టు 8 నుండి ఆగస్టు 15 వరకు చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్ భారత్ (డిడిడబ్ల్యుఎస్ ) కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించింది.
ఈ మూడ కేటగిరీల్లోనూ అద్భుత ఫలితాలు సాధించిన తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ డిడిడబ్ల్యుఎస్ డైరెక్టర్ యుగల్ జోషీ తెలిపారు. అలాగే జిల్లాల కేటగిరీలో మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు మూడో స్థానం దక్కింది. ఈ మేరకు యుగల్ జోషీ, మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకి లేఖను పంపించారు.
కాగా, అక్టోబర్ 2 వ తేదీ, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఈ అవార్డులను అందచేస్తారు. అయితే కరోనా సమయం కావడంతో జూమ్ ద్వారా, యూ ట్యూబ్ లైవ్ ద్వారా ఈ అవార్డులను కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వర్చువల్ పద్ధతిలో అవార్డులను అందచేస్తారు. మన రాష్ట్రం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ అవార్డుని స్వీకరిస్తారు.
కాగా, వరసగా ఈ అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎం కెసిఆర్, కెటిఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు.
గ్రామాల్లో ఇండ్ల ఉచిత ఆన్ లైన్ ప్రక్రియపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు:
వ్యవసాయ దారులకు పట్టాదారు పాసు పుస్తకాల తరహాలో గ్రామాల్లో ఇండ్లకు కూడా మెరూన్ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయించినందున ఆయా వివరాలతో కూడిన రికార్డును పకడ్బందీగా తయారు చేయాలని ఉన్నతాధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటివ సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు గ్రామాల్లోని ప్రతి ఇల్లు, అంగుళాన్ని రికార్డు చేయాలని మంత్రి సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులతో మంత్రి హైదరాబాద్ లోని మంత్రులు నివాసంలో సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కొత్త రెవిన్యూ చట్టంలో భాగంగా, వ్యవసాయ భూములకు మాదిరిగానే, గ్రామాల్లోని ఇండ్లు, ఇతర అన్ని రకాల నిర్మాణాలకు కూడా భద్రత కల్పిస్తూ, పట్టాదారు పాసు పుస్తకాల ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారన్నారు. భూములకు భద్రత కల్పించడంతోపాటు, ఆయా భూ, ఇండ్ల యజమానులకు భరోసానివ్వాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. ఇందుకనుగుణంగా గ్రామాల్లోని ప్రతి ఇల్లు, ఇతర నిర్మాణాల వివరాలు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఇండ్లు, వగైరాలన్నీ ప్రతి అంగుళం రికార్డు చేయాలని అందుకు తగ్గట్లుగా, కింది స్థాయి వరకు ఆదేశాలు వెళ్ళాలని చెప్పారు.
ఎలాంటి లోపాలు లేకుండా రికార్డు ప్రక్రియను ఓ ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల్లో అనుమానాలు, అపోహలుంటే తొలగించాలని చెప్పారు. కేవలం భద్రత కల్పించడమే తప్ప, ఇందులో హిడెన్ ఎజెండా ఏదీ లేదనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయాలన్నారు. దళారులు, ఇతరులెవరికీ డబ్బులు కూడా ఇవ్వాల్సిన పనిలేదని, ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి ఉచితంగా జరుగుతుందన్న విషయంపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.