డెంగ్యూ, ఇతర కీటక జనిత వ్యాధుల విశ్లేషణపై పుస్తకం విడుదల చేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 26: డెంగ్యూ, మలేరియా, ఇతర కీటక జనిత వ్యాధులను వివరిస్తూ అయ్యదేవర రోషన్ చంద్ర తయారు చేసిన పుస్తకాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ లతో కలిసి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నేడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు విడుదల చేశారు. ఈ పుస్తకంలో రాబోయే 2025 సంవత్సరం వరకు ఎన్ని డెంగ్యూ కేసులు, మలేరియా కేసులు నమోదు అయ్యే అవకాశం వుంది, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ముందుగానే సాఫ్ట్ వేర్ మరియు కోడ్ ద్వారా వివరించారు. మూసీ నది, చెరువులలో ఉన్న గుర్రపు డెక్క వల్ల వచ్చే వ్యాధులు, ఇళ్లల్లో నీరు నిలువ ఉండడం వలన వచ్చే వ్యాధులను వివరించారు.
ఈ పుస్తకం రాబోయే సంవత్సరాల ప్రణాళికను తయారు చేయడానికి ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ రోషన్ చంద్రను అభినందిస్తూ అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.